Asianet News TeluguAsianet News Telugu

Traffic challans: అయ్యా బాబోయ్.. హోండా యాక్టివాపై ఏకంగా 117 చలాన్లు.. డేటా చూసి షాక్ తిన్న పోలీసులు..

హైదరాబాద్‌లో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు (hyderabad traffic police) ఓ బైక్‌పై ఉన్న చలాన్లు (traffic challans) చూసి షాక్ తిన్నారు. ఆ బైక్‌పై 10, 20 కూడా కాదు.. ఏకంగా 117 చలాన్లు ఉన్నాయి. అతని చలాన్ల డేటాను బయటకు తీసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. 

117 pending traffic challans on activa honda bike in hyderabad
Author
Hyderabad, First Published Nov 16, 2021, 5:28 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు (hyderabad traffic police) నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఇందు కోసం అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదిలా ఉంటే వాహనాలపై ఒకటి రెండు చలాన్లు (traffic challans) ఉంటేనే వాహనదారులు భయపడిపోతున్న పరిస్థితి. పోలీసులకు వాహనం చిక్కితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే భయంతో.. చాలా మంది వాహనదారులు ఏవైనా పెండింగ్ చలాన్లు ఉంటే వెంట వెంటనే కట్టేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులు ఉండగా.. hyderabadలో వాహనాల తనిఖీ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు ఓ బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్ తిన్నారు. ఆ బైక్‌పై 10, 20 కూడా కాదు.. ఏకంగా 117 చలాన్లు ఉన్నాయి. అతని చలాన్ల డేటాను బయటకు తీసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వివరాలు.. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 హోండా యాక్టివా (honda activa) వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనదారుడికి హెల్మెట్ కూడా లేకపోవడంతో.. ఆ బైక్‌పై ఉన్న చలాన్లను చెక్ చేశారు. 117 చలాన్లు పెండింగ్‌లో ఉండగా..  రూ. 30 వేల వరకు జరిమానాలు ఉన్నాయి. చలాన్లు కట్టకుండా తిరుగుతున్న అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనాన్ని సీజ్‌ చేశారు.

2014 నుంచి ఆ వాహనంపై చలాన్లు ఉన్నాయి. ఆ బైక్ నడిపిన వ్యక్తి ఎప్పుడు హెల్మెట్ ధరించలేదని చలాన్లను చూస్తే అర్థమవుతుంది. చాలా వరకు హెల్మెట్ ధరించనందుకు విధించిన చలాన్లే. ఇవే కాకుండా రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్, కోవిడ్ టైమ్‌లో మాస్క్ ధరించనందుకు కూడా విధించిన చలాన్లు ఉన్నాయి. అంటే దాదాపు ఆరేళ్లకు పైగానే ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడంటే మాములు విషయం కాదు. 

ఇదిలా ఉంటే..  వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా రూల్స్ పాటించాల‌ని, వాహనాల‌పై చ‌లాన్లు ఉన్నాయా లేదా అని ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.  చ‌లాన్లు కట్ట‌కుంటే మోటార్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios