ప్రశ్నోత్తరాలకు పదే పదే అడ్డుపడుతున్నారన్న కారణంతో స్పీకర్ మదుసూధనాచారి 11 మంది సభ్యులను సభ నుండి ఒకరోజు సస్పెండ్ చేసారు.

అసెంబ్లీ సమావేశాల రెండో రోజు విపక్షాలకు చెందిన 11 మంది శాసనసభ్యులు సస్పెండ్ అయ్యారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపా, టిడిపి సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చను స్పీకర్ తిరస్కరించారు. దాంతో సభలో ప్రశ్నోత్తరాలకు సభ్యులు పదే పదే అంతరాయాలు కల్పించారు.

తొలుత కాంగ్రెస్ సభ్యులు ఫిరాయింపు ఎంఎల్ఏలపై చర్యను కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అదే విధంగా కేజి టు పిజి విద్య, ఫీజు రీఎంబర్స్ మెంట్, విద్యార్ధులకు స్కాలర్ షిప్పుతో పాటు విద్యారంగానికి సంబంధించిన అంశాలపై భాజపా, టిడిపి సభ్యులు చర్చను కోరుతూ వాయిదా తీర్మానాలు అందించాయి.

అయితే, మూడు తీర్మానాలనూ స్పీకర్ తోసిపుచ్చారు. ఫిరాయింపు శాసనసభ్యులపై చర్యల విషయం తన పరిశీలనలో ఉందని స్పీకర్ చెప్పారు. సరైన సమయంలో తాను నిర్ణయం తీసుకుంటానన్నారు.

అలాగే ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని స్పీకర్ పదే పదే కోరారు. అయితే తామిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చగానే సభ్యులు ఆగ్రహంతో సమావేశాలకు అంతరాయాలు కల్పించారు. 

ప్రశ్నోత్తరాలకు పదే పదే అడ్డుపడుతున్నారన్న కారణంతో స్పీకర్ మదుసూధనాచారి 11 మంది సభ్యులను సభ నుండి ఒకరోజు సస్పెండ్ చేసారు.

సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డికె అరుణ, మల్లు భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, ఎన్. పద్మావతి, సంపత్ కుమార్ ఉన్నారు. టిడిపి నుండి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య కూడా సస్పెండ్ అయ్యారు.