తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి  ఈ నెల 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఈ నెల 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో 2,43,852 మంది బాలురు, 2,41,974 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల ప్రక్రియను పర్యవేక్షించేందుకు బోర్డు మొత్తం 34,000 మంది ఇన్విజిలేటర్లను నియమించింది. పరీక్షల పర్యవేక్షణకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లు తప్ప ఇతర పేపర్లు తీసుకురావద్దని, పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్‌లు తీసుకురావడంపై నిషేధం విధించారు.

పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లతో జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం ఐదు నిమిషాలు గ్రేస్ సమయం కేటాయించనున్నారు. దీంతో విద్యార్థులను 9:35 గంటల వరకు లోనికి అనుమతించనున్నారు. ఇక, పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్‌లతో కూడిన మెడికల్ కిట్‌లతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

మరోవైపు పరీక్షా కేంద్రాలను నోమొబైల్‌ ఫోన్‌ జోన్‌గా ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ఇక, పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆందోళన చెందకుండా ఉంటే పరీక్షలను విజయవంతంగా రాయగలగరని చెబుతున్నారు.

ఇక, పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సౌకర్యం కోసం పరీక్షలకు ముందు, తర్వాత సర్వీసుల సంఖ్యను పెంచింది. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు.. పరీక్ష ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లేటప్పుడు తమ హాల్‌ టిక్కెట్లు చూపి ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.