హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరు భేష్ అని సిపిఐ జాతీయ నాయకులు, సిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ నారాయణ అభినందనలు తెలిపారు. ప్రధానంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్), గాంధీ హాస్పిటల్, నేచర్ క్యూర్ హాస్పిటల్, కింగ్ కోటి హాస్పిటల్ లో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

సిఆర్ ఫౌండేషన్ లో ఉంటున్న చాలామంది వయసు మీద పడిన వారికి కరోనా సోకడంతో వీరందరిని హాస్పిటల్ లో చేర్పించి వైద్య చికిత్సలు అందించామని, వారందరూ కూడా కోలుకొని క్షేమంగా తిరిగి హోమ్ కి రావడం పట్ల నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 103 సంవత్సరాల వయసున్న పరుచూరి రామస్వామి ఆరోగ్యంగా తిరిగి రావడంపై అయిన ఆనందం వ్యక్తం చేశారు.  ఇందు కోసం కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

read more  కరోనా కలకలం: మాదాపూర్ ఎస్ఐ అబ్బాస్ కోవిడ్‌తో మృతి

ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ 2 వేలకు పైగానే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 67 వేల 46కు చేరింది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1016కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు లక్షా 35 వేల 357 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 30,673 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదులో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో హైదరాబాదులో 314 మందికి కరోనా సోకింది. జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.