హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ లో శుక్రవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా , పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురు బైకర్లకు గాయాలయ్యాయి.

ఉప్పల్ -హబ్సిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద ఓ లారీ వేగంగా వచ్చి ఓ డీసీఎంను ఢీకొట్టింది. దీంతో అక్కడే ఉన్న ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాదు అక్కడే పార్క్ చేసిన బైకులపైకి లారీ దూసుకెళ్లింది.

 

ఈ ఘటనలో ఓ బైక్ పై ప్రయాణీస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. డీసీఎం వ్యానులో ప్రయాణీస్తున్న నలుగురు గాయపడ్డారు.

 లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు.  ఈ ప్రమాదంతో ఉప్పల్- సికింద్రాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

లారీ డ్రైవర్ ను స్థానికులు పట్టుకొని చితకబాదారు.  ఈ విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్నారు.