దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటంతో ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని తలసాని స్పష్టం చేశారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ మిగిలిన నేరస్థులకు ఒక గుణపాఠమన్నారు.

ఆదివారం ఒక జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన తలసాని.. తాను మొదట్లో చెప్పిన దానిని, చివర్లో చెప్పిన దానిని కట్ చేసి అతికించారని ఆయన ఆరోపించారు. దిశ ఘటన జరిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్ట్ చేసిందని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

Also Read:ఇక కాల్చి పారేయడమే: రేపిస్టుసులకు తలసాని హెచ్చరిక

ఇదే సమయంలో ఎన్‌కౌంటర్ గురించి మాట్లాడిన మంత్రి.. నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకుని వెళ్లారని.. అయితే నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించారని తలసాని వెల్లడించారు. అక్కడితో ఆగకుండా రాళ్లు రువ్వడం, తుపాకులను లాక్కొని తర్వాత కాల్పుల జరిపారని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

అయితే పోలీసులు ఆత్మరక్షణ కోసం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత దేశ ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్లిందన్నారు. అంతకుముందు శనివారం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ యాదవ్ ఎన్‌కౌంటర్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు.

ఇది కేసీఆర్ ఉగ్రరూపమని, ఈ ఎన్‌కౌంటర్ దేశానికే మార్గదర్శకమని తలసాని వ్యాఖ్యానించారు. నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని, ఇదే సమయంలో కేసీఆర్ మౌనాన్ని చాలా మంది తక్కువగా అంచనా వేశారని తలసాని అన్నారు.

Also Read:Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి

మహిళలపై మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి నిర్ణయం తీసుకున్నారని గులాబీ బాస్‌ను కొనియాడారు. సంక్షేమ పథకాలే కాదు మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. వికారుద్దీన్ గ్యాంగ్, నయిమ్ గ్యాంగ్ వంటి ఎన్నో కేసులను తెలంగాణ ప్రభుత్వం తనదైన శైలిలో ఛేదించిందన్నారు

కేసీఆర్ ఎక్కడికి రారని.. ఆయనకు ఉగ్రరూపం వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలుసంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కొంతమంది ఏ అవకాశం వచ్చినా ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తారని.. మరి అప్పుడు అలా అన్న వారు ఇప్పుడేం సమాధానం చెబుతారని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.