ఆ ఫోన్లను అప్ గ్రేడ్ చేసుకోండి.. లేకపోతే 2020లో వాట్సాప్ సేవలు బంద్
తమ వినియోగదారులకు షాకిచ్చింది వాట్సాప్. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. విండోస్ ఫోన్లకు మాత్రం పూర్తిగా సేవలు విరమించుకోనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ఆకట్టుకునే సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్.. తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పని చేసే కొన్ని స్మార్ట్ఫోన్లకు సేవలు నిలిపేయనున్నట్లు తెలిపింది. ఏఏ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయో పరిశీలిద్దాం..
వర్షన్ 2.3.7 కన్నా తక్కువ ఓఎస్‌తో పనిచేస్తున్న అన్ని అండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ సేవలు 2020 ఫిబ్రవరి 1 నుంచి ముగియనున్నాయి. ఈ ఓఎస్ ఫోన్లు గల కస్టమర్లు వాట్సాప్‌ను ఉపయోగించాలంటే కొత్త మోడల్ ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
అమెజాన్ అలెక్సాతో బోట్ స్టోన్ పోర్టబుల్ స్పీకర్
ఐఓఎస్ 8, అంతకన్నా తక్కువ ఓఎస్ వెర్షన్లతో పని చేసే అన్ని ఆపిల్ ఫోన్లలోనూ వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ ఫోన్లకు నుంచి ఇది వర్తిస్తుంది.
విండోస్ ఫోన్లకు మాత్రం 2020 జనవరి 1 నుంచి పూర్తిగా సేవలు ఆగిపోనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రస్తుతం విండోస్ యూజర్లు వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ వాడాలంటే ఆండ్రాయిడ్కుగానీ, ఐఓఎస్‌కు గానీ మారక తప్పని పరిస్థితి నెలకొంది.
మీరు పాత ఫోన్లు వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లో వాట్సాప్ ప్రకటించిన వెర్షన్లలో మీ ఫోన్ ఉందోలేదో తెలుసుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీ ఫోన్ మోడల్ ఆ జాబితాలో ఉంటే మీ వాట్సాప్ డేటా మొత్తం బ్యాకప్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నా పెద్దగా భయపడాల్సిన పనిలేదని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది కనీసం రెండేళ్లకోసారి ఫోన్‌ను మారుస్తున్నందున వాటిలో పాత వెర్షన్ ఓఎస్ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.
ఫోన్‌పే యాప్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో తెలుసా...?
అండ్రాయిడ్, ఐఓఎస్ పాత వెర్షన్ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, వారు మాత్రం కొత్త మోడల్‌కు అప్గ్రేడయితే సరిపోతుందని అంటున్నారు. విండోస్ ఫోన్ యూజర్లు మాత్రం తప్పని సరిగా అండ్రాయిడ్ గానీ, ఐఓఎస్కుగానీ మారక తప్పదని సూచిస్తున్నారు.