WhatsApp to limit messages: వాట్సాప్ మరో కీల‌క‌ నిర్ణయం.. ఇక‌పై అలా చేయ‌డం క‌ష్ట‌మే..!

అత్యంత వినియోగ సామాజిక మాద్యమం వాట్సాప్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది. గ్రూపులో మెసేజ్ లు ఫార్వార్డ్ చేయడంపై పరిమితి తీసుకువచ్చింది. ఇకపై గ్రూపులో ఫార్వార్డ్ మెసేజ్ లను ఒకసారికి మించి ఫార్వార్డ్ చేయడం కుదరదు.
 

WhatsApp to limit forwarded messages

ఉచితంగా సర్వీసులు అందించే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ లో ఇటీవల స్పామ్(మోస పూరిత) కాల్స్, మెసేజెస్ బెడద పెరిగిన నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్ లపై సంస్థ కట్టడి చర్యలకు దిగింది. ఇకపై గ్రూపులో ఫార్వర్డ్‌ మెసేజ్‌లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్‌ చేసుకునేలా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ మెసేజ్ ల కట్టడికి సంబందించి తాము తీసుకున్న నిర్ణయాన్ని ఈ మేరకు వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌లో వెల్లడించారు. వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 22.2.7.2, ఐఫోన్‌ 22.7.0.76 వెర్షన్‌లో ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

వాబీటాఇన్ఫో చెప్పిన వివరాలను బట్టి.. ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు, వ్యక్తులకు త్వరగా ఫార్వర్డ్‌ చేయడం వీలుకాదు. ఒక వేళ ఫార్వర్డ్‌ చేయాలని అనుకుంటే తిరిగి మెసేజ్‌ను ఎంచుకుని ఫార్వర్డ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టగా, మరికొన్ని ఆండ్రాయిడ్‌ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నట్లు తెలిపింది. కాగా, ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకేసారి ఐదుగురికి గానీ, ఐదు గ్రూపులకు ఫార్వర్డ్‌ చేసే సదుపాయం ఉంది. ఈ కొత్త నిబంధనలు వస్తే ఒకేసారి ఫార్వర్డ్‌ చేసే వీలుంటుంది. 

అయితే.. ఈ నిబంధనలను మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఇంకొన్ని రోజుల్లో అన్ని స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వర్డ్‌ చేసే వీలు ఉండకపోవచ్చు. నిజానికి 2018 జులైలో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ భారత్‌లో ఈ నిబంధనను తొలిసారి ప్రవేశపెట్టింది. యూజర్లు గరిష్ఠంగా ఐదు వేర్వేరు చాట్‌లకు ఒకసారి మాత్రమే మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసుకునేలా పరిమితిని విధించిన విషయం తెలిసిందే. గ్రూపుల్లో స్పామ్ మెసేజ్ లు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి వాట్సాప్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అంత‌కుముందు Whatsapp పలు భారతీయ అకౌంట్లపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఫిబ్రవరి 2022లో 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ నెలవారీ నివేదిక ప్రకారం.. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వాట్సాప్ యూజర్ల ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించినట్టు వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios