న్యూయార్క్: కరోనా.. కరోనా.. కోవిడ్-19.. మహమ్మారి అనే పదం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీనిపై ఒక్కొక్కరి దగ్గర, ఒక్కో సంస్థ, ఒక్కో వేదిక వద్ద ఓక్కోరకమైన సమాచారం ఉంది. మరి ఖచ్చితమైన, విశ్వసనీయ సమాచారం తెలిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ‘హెల్త్ అలర్ట్’ అనే ప్రోగ్రాంను శనివారం ప్రారంభించింది. 

‘హెల్త్ అలర్ట్’ పేరిట వాట్సాప్‌లో డబ్ల్యూహెచ్ఓ అందుబాటులోకి తెచ్చిన అధికారిక ఎన్జీవో లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్. ఇందులో 150 కోట్ల మందికి పైగా వినియోగదారులు ప్రశ్నలకు అడిగి.. ఈ వైరస్ విషయమై ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఇది ప్రతిరోజూ 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది. 

ఇది కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు స్వీయ రక్షణ చేసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంది. ప్రయాణాల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తుంది.

ఎప్పటికప్పుడు వైరస్‌కు సంబంధించిన కొత్త విషయాలపై అధికారిక సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ఇప్పటికే ఈ గ్రూపులో సింగపూర్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ, దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ, ఇండోనేషియాలోని కోమిన్ ఫో చేరాయి. 

ప్రస్తుతం ఈ హెల్త్ అలర్ట్ ఇంగ్లీష్ భాషలో వినియోగదారులకు సేవలు అందిస్తుంది. కొన్ని వారాల్లో మొత్తం ఆరు భాషలు అంటే.. ఇంగ్లీష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి తీసుకు రానున్నది. 

డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అలర్ట్‌ను సంప్రదించడానికి మీ ఫోన్‌లో 41 79 893 1892 నంబర్ సేవ్ చేసి, ఆపై ప్రారంభించడానికి వాట్సాప్ మెసేజ్‌లో ‘హాయ్’ అనే పదం టైప్ చేయాలి. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసి ఉంటే డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అలర్ట్‌తో మెస్సేజ్‌లు పంపడానికి హోంపేజీలోని డబ్ల్యూహెచ్ఓ లింక్‌పై క్లిక్ చేయండి. 

వాట్సాప్ లేకపోతే వాట్సాప్ డాట్ కామ్ / కరోనా వైరస్ అనే లింక్ ద్వారా వాట్సాప్ కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్ లోనూ తెలుసు కోవచ్చు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోన్ స్పందిస్తూ ‘ముఖ్యమైన ఆరోగ్య సమాచారం కోట్ల మంది ప్రజలను చేరుకోవడంలో మాకు సహకరిస్తున్న ఫేస్ బుక్, వాట్సాప్ వంటి భాగస్వాములను కలిగి ఉండటం మాకు గర్వ కారణం’ అని తెలిపారు. 

Also read:నెట్‌ఫ్లిక్స్ ఉదారత: సినీ కార్మికుల కోసం 10 కోట్ల డాలర్ల నిధి

ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ భాగస్వామ్యంతో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, యూఎన్డీపీ కలిసి వాట్సాప్ కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్ ప్రారంభించాయి. ఈ హబ్ ద్వారా ప్రపంచ వ్యాప్త కస్టమర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తారు. ఇది ఖచ్చితమైన ఆరోగ్య సమాచారం అందరికీ అందించడానికి వదంతుల వ్యాప్తిని తగ్గించేందుకు ఉపకరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.