న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రైవేట్ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా దిగి వచ్చింది. ఏజీఆర్‌ బకాయిలను చెల్లిస్తామని వొడాఫోన్‌ ఐడియా శనివారం ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలను తీర్చే పని మొదలు పెట్టినట్లు తెలిపింది. 

ఎంత చెల్లించాల్సి ఉందన్న దానిపై మదింపు చేస్తున్నట్లు వొడాఫోన్ స్పష్టం చేసింది. ‘టెలికం శాఖకు మేము ఇవ్వాల్సిన ఏజీఆర్‌ ఆధారంగా లెక్కించిన బకాయిలు ఎంత ఉన్నాయి? అనేది పరిశీలిస్తున్నాం. కొద్ది రోజుల్లోగా బాకీలను తీరుస్తాం’ అని బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ)కు వొడాఫోన్‌ చెప్పింది. 

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు కేసులో తమ ఆదేశాలను లెక్క చేయడం లేదని టెలికం శాఖపై, సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. టెలికం కంపెనీలకు, టెలికం శాఖలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.

కాగా, టెలికం రంగ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి విశిష్ట అధికారాలుండాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) గట్టిగా అభిప్రాయపడింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ విస్తృత అధికారాలు, అవకాశాలు పెరుగాల్సిన అవసరం ఉందని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ పీటీఐతో మాట్లాడుతూ అన్నారు.

సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన సవరణ అభ్యర్థనపై వచ్చే ఆదేశాలపైనే తమ వ్యాపారం ఆధారపడి ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. అనుకూలంగా వస్తే భారత్‌లో వొడాఫోన్‌ ఐడియా టెలికం కంపెనీ ఉంటుందని, లేనిపక్షంలో ఉండదన్న సంకేతాలను ఇచ్చింది. 

వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ.53,038 కోట్లుగా ఉన్నాయి. ఇందులో స్పెక్ట్రం బకాయిలు రూ.24,729 కోట్లు, లైసెన్స్‌ ఫీజు బాకీలు రూ.28,309 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గడువులోగా బకాయిలను చెల్లించని సంస్థలపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు టెలికం శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. 

అక్టోబర్‌ 31, నవంబర్‌ 13, డిసెంబర్‌ 2, జనవరి 20, ఫిబ్రవరి 14 తేదీల్లో టెలికం సంస్థలకు టెలికం శాఖ నోటీసులు పంపినట్లు చెబుతున్న సంబంధిత వర్గాలు.. సోమవారం దీనిపై ఓ కీలక నిర్ణయం వెలువడవచ్చన్న అంచనాలు వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో ఏదైనా టెలికం సంస్థ దివాలా తీస్తే దాని మూల్యం అంతిమంగా చెల్లించేది బ్యాంకులేనని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

రూ.1.47 లక్షల కోట్ల బాకీలు టెలికం కంపెనీలు చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైనా టెలికం సంస్థ మూతబడితే బ్యాంకులు, ఉద్యోగులు, వ్యాపారులు, వినియోగదారులు అంతా ప్రభావితం అవుతారని అన్నారు. అంతిమంగా బ్యాంకులపైనే భారం పడుతుందని రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

వేల మంది ఉద్యోగాలు పోతే, వ్యాపారులు నష్టాలపాలైతే బ్యాంకుల మొండి బకాయిలు పెరిగే వీలుందని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. అంతేగాక సదరు సంస్థ రుణాలు మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారే వీలుందన్నారు. ఆర్‌కామ్‌, ఎయిర్‌సెల్‌ సంస్థలు దివాలా తీయడంతో టెలికం రంగంలో వాటి రుణాలు మొండి బకాయిల జాబితాలో ఉన్నాయని శనివారం న్యూఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.