Asianet News TeluguAsianet News Telugu

ప్రైవసీ సెక్యూరిటీ ఉల్లంఘన: ఫేస్‌బుక్‌పై రూ. 34వేల కోట్ల ఫైన్

ప్రైవసీని ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) భారీగా జరిమానా విధించింది. 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధిస్తూ ఎఫ్ టీసీ చేసిన తీర్మానాన్ని అమెరికా న్యాయశాఖ ఆమోదించాలి. జరిమానా భారీమొత్తమైనా ఫేస్ బుక్ షేర్లు బలపడటం ఆసక్తికర అంశం.

USD 5 bn US fine set for Facebook on privacy probe: Report
Author
Washington D.C., First Published Jul 14, 2019, 11:12 AM IST

వినియోగదారుల వ్యక్తిగత భద్రత వైఫల్యాలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. దర్యాప్తు సెటిల్‌మెంట్‌లో భాగంగా ఫేస్‌బుక్‌ 5 బిలియన్‌ డాలర్లు (రూ. 34వేల కోట్లు) చెల్లించేందుకు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్ టీసీ) 3-2 ఓట్లతో అంగీకరించిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. 

ఈ నియంత్రణ మండలిలోని డెమోక్రాట్‌ సభ్యులు సెటిల్‌మెంట్‌ ప్రతిపాదనను వ్యతిరేకించగా, రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు పలికారు. వ్యక్తిగత భద్రతా వైఫల్యాల విషయమై ఓ కంపెనీకి ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ ఇంత భారీ స్థాయిలో జరిమానా విధించడం ఇప్పుడే. 

2012లో సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ 2.2 కోట్ల డాలర్ల ఫైన్‌ చెల్లించింది. పౌర డివిజన్‌కు చెందిన న్యాయవిభాగం ఫేస్ బుక్ యాజమాన్యంపై జరిమానా విధిస్తూ ఎఫ్ టీసీ ఆమోదించిన తీర్మానాన్ని సమీక్షించి తుది తీర్పును వెలువరిస్తుంది. అయితే ఈ విచారణకు ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సంబంధిత వర్గాలు. 

ఫేస్‌బుక్‌పై గతంలోనూ భద్రతా వైఫల్యాల ఆరోపణలు వచ్చాయి. దీంతో 2011లో ఈ కంపెనీ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌తో సెటిల్‌మెంట్‌ చేసుకుంది. ఈ సెటిల్మెంట్ ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవల కేంబ్రిడ్జ్‌ అనలిటికా వివాదంతో ఈ సోషల్‌మీడియా సంస్థపై భారీగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 

దీంతో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ గతేడాది ఫేస్‌బుక్‌పై ఉన్న కేసును మళ్లీ తెరిచింది. ఈ కేసు దర్యాప్తును పునఃప్రారంభించనున్నట్లు గత ఏడాదే ఎఫ్‌టీసీ ప్రకటించింది. ఈ కేసు సెటిల్‌మెంట్‌లో భాగంగానే భారీ జరిమానా విధించింది. జరిమానాతో పాటు కొన్ని ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ జరిమానాను ఫేస్‌బుక్‌ ఎప్పుడో ఊహించింది. డేటా వైఫల్యం కేసులో న్యాయపరమైన రాజీ కోసం 3 నుంచి 5 బిలియన్‌ డాలర్లు కట్టాల్సి వస్తుందని ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ అంచనా వేసింది. ఇంత భారీ జరిమానా విధించినప్పటికీ దాని ప్రభావం షేర్లపై ఏమాత్రం కనిపించలేదు. 1.8 శాతం షేర్లు ఊపందుకున్నాయి. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి కోట్ల మంది యూజర్ల డేటాను తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వివాదంతో ఫేస్‌బుక్‌ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవడమేగాక.. అనేక దేశాల్లో న్యాయపరమైన సమస్యల్లోనూ చిక్కుకుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ కంపెనీకి జరిమానాలు విధించాయి. 

భారీ స్థాయిలో ఆదాయం ఆర్జిస్తున్న కంపెనీకి ఈ జరిమానా చెల్లించడం పెద్ద లెక్క కాదని.. సంస్థపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిందని ఫేస్‌బుక్‌ విమర్శకులు అంటున్నారు.

ముఖ్యంగా యూజర్ల వ్యక్తి గత సమాచార భద్రత విషయంలో ఫేస్‌బుక్‌పై కఠిన ఆంక్షలు విధించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది కంపెనీ 5,600 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఏడాదిలో ఇది 6,900 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా. 

Follow Us:
Download App:
  • android
  • ios