ప్రముఖ మ్యూజిక్ యాప్ టిక్ టాక్ మళ్లీ ప్లేస్టోర్ లలోకి వచ్చేసింది. ఇటీవల అతి తక్కువ కాలంలో క్రేజ్ సంపాదించుకున్న యాప్ ఇది. అయితే... దీనిని ఉపయోగించుకొని చాలా మంది యువత  సోషల్ మీడియాలో క్రేజ్ కూడా పెంచుకున్నారు. అయితే.. ఈ యాప్ ద్వారా చాలా మంది అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఈ యాప్ పై నిషేధం ప్రకటించారు.

ఈ యాప్‌పై మద్రాసు హైకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో దాన్ని యాప్‌ స్టోర్ల నుంచి తీసేయాలని ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిన నేపథ్యంలో అవి యూజర్లకు అందుబాటులో లేకుండా పోయాయి. ఆ యాప్‌పై ఉన్న నిషేధాన్ని కొన్ని షరతులతో మద్రాసు హైకోర్టు ఇటీవల ఎత్తేసింది. నిషేధం ఎత్తేసిన దాదాపు వారం రోజుల తర్వాత యాప్‌ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

 ‘నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. తమ క్రియేటివిటీని బయటపెడుతూ యూజర్లు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. భారత యూజర్లకు మరింత మంచి సేవలను అందించడానికి మాకు వచ్చిన అవకాశం పట్ల గర్విస్తున్నాము. ఆ యాప్‌లో మరిన్ని సురక్షితమైన ఫీచర్లను తీసుకొస్తాం’ అని ఇటీవల టిక్‌టాక్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.