హైదరాబాద్‌: జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత భారత ఇంటర్నెట్‌ కంపెనీలకు డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా యువతకు వ్యసనంలా మారిన టిక్‌టాక్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో నెటిజన్లు ​అయోమయంలో పడ్డారు. 

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే వేరే యాప్‌ల కోసం జల్లెడ వేసి మరీ  వెతుకున్నారు. ఈ క్రమంలో స్వదేశీ యాప్‌ల వైపు మొగ్గు చూపుతూ.. తమ ప్రతిభను ప్రపంచానికి చూపే పనిలో పడ్డారు. మనదేశం- మన యాప్‌లనే ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో దేశంలో స్వదేశీ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది.  

ఇందులో భాగంగా అచ్చం టిక్‌టాక్‌ను మాదిరిగానే సంతోషాలను, ఆనందాలను, వీడియోలను ప్రపంచానికి చూపేందుకు ఐ మీడియా అండ్‌ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ పూర్తి స్వదేశీ యాప్‌ ‘పాప్‌-ఇన్’ను రూపొందిస్తోంది. ఆధునాతన స్వదేశీ పరిజ్ఞానంతో, వినూత్నమైన ఎన్నో ఫీచర్స్‌తో తయారవుతోంది. అత్యంత సులభతరంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేలా పాప్‌-ఇన్‌‌ను రూపొందిస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు ఎన్ ఫణి రాఘవ, కె వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాధవర్మ, బంగార్రాజు తెలిపారు.  

also read:డ్రాగన్’కు షాక్: భారత్ వైపే ఆపిల్ మొగ్గు.. బిలియన్ డాలర్ల పెట్టుబడులు !

పాప్‌-ఇన్‌ పూర్తి స్వదేశీ యాప్‌ అని, ఇది ప్రపంచానికి మనదేశ సత్తా చాటుందని ఎన్ ఫణి రాఘవ, కె వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాధవర్మ, బంగార్రాజు ధీమా వ్యక్తం చేశారు. అరచేతిలో ఆనందాలను పంచే విధంగా పాప్‌ఇన్ యాప్‌ రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. 

దేశ భవిష్యత్తు స్వదేశీ యాప్‌లపైనే ఆధారపడివుందని,యావత్ ప్రపంచం మన దేశ యాప్‌లను వినియోగించుకునేందుకు ఇష్టపడతారని ఫణి రాఘవ తెలిపారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాప్-ఇన్‌ యాప్‌ ఉంటుందని, దీనిని మించి మరే ఇతర దేశం యాప్‌ను రూపొందించలేదని అన్నారు. హై టెక్‌ వెర్షన్‌తో పాప్‌-ఇన్ మరి కొద్దిరోజుల్లోనే ప్రజల ముందుకు రానుందని వెల్లడించారు.  

టిక్‌టాక్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా షింగారీ యాప్ సంచలనాలు స్రుష్టిస్తోంది. మరోవైపు టిక్ టాక్ యాజమాన్యం కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందుకోసం చైనా నుంచి ప్రధాన కార్యాలయాన్ని తరలించాలన్న యోచనలో బైట్స్ డ్యాన్స్ ఉంది.