ముంబై: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ప్రవేశం భవిష్యత్‌లో ఐటీ, టెక్నాలజీ రంగ కంపెనీలకు అతి పెద్ద అవకాశమని టెక్‌ మహీంద్రా భావిస్తోంది. ప్రత్యేకంగా తమ కమ్యూనికేషన్స్‌ విభాగం అంతర్జాతీయంగా ఇప్పటి నుంచి క్రమమైన వృద్ధి పథంలో పయనించడానికి అది చక్కని అవకాశమని టెక్‌ మహీంద్రా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ (సీఈఓ) అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిపి గుర్నానీ అన్నారు. సాంప్రదాయకంగానూ తమ కంపెనీకి కమ్యూనికేషన్స్‌ విభాగమే ప్రాణాధారంగా నిలుస్తున్నదని చెప్పారు.
 
కమ్యూనికేషన్స్‌ రంగం గత కొంత కాలంగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగా సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఈ విభాగం నాలుగు శాతం వృద్ధితోనే సరిపెట్టుకోవలసి వచ్చిందని టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.8629 కోట్ల ఆదాయంలో కమ్యూనికేషన్‌ విభాగం వాటా 41.5 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ వాటా 45.2 శాతం ఉండగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 39.6 శాతానికి దిగజారింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న 5జీ టెక్నాలజీలే ఆ విభాగం క్రమబద్ధమైన వృద్ధి సాధించడానికి చక్కని అవకాశంగా నిలుస్తుందని ఆయన నమ్మకంగా చెప్పారు.
 
సుమారుగా అన్ని దేశాలు 5జీ టెక్నాలజీలకు అనుగుణంగా స్పెక్ట్రం కేటాయించాయని టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు. ప్రధానంగా వర్చువల్‌ టెక్నాలజీల్లో తమకు ఎనలేని బలం ఉన్నదంటూ ఈ విభాగంలో రానున్న కాంట్రాక్టులన్నింటికీ తాము బిడ్‌ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. దేశీయంగా టెలికాం కంపెనీల వ్యాపారం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ ఇంచుమించుగా అన్ని కంపెనీలు స్పెక్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయని, ఏదో ఒక సమయంలో తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం వస్తుందని ఆతృతగా ఎదురుచూస్తున్నాయని సీపీ గుర్నానీ తెలిపారు. 

ఏడాదికి 8 నుంచి 10 శాతం వృద్ధి సాధించాలన్నది తమ లక్ష్యమని టెక్ మహీంద్రా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నానీ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో తాము మొత్తం మూడు వేల మందిని నియమించుకున్నరట్టు సీపీ గుర్నానీ తెలిపారు. భవిష్యత్ లో మరి కొంత మందిని నియమించుకుంటామన్నారు. ఆటోమేషన్ తోపాటు, వనరుల సద్వినియోగంతోపాటు సిబ్బందికి శిక్షణపై మరింత శ్రద్ధ చూపుతామని టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ వివరించారు. సరైన సమయంలో బిజినెస్ లక్ష్యాల సాధనలో భాగంగా సిబ్బంది త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.