న్యూయార్క్: గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ల విపణిలో మడతబెట్టే (ఫోల్డబుల్) ఫోన్లు యమ సందడి చేస్తున్నాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్ ఇప్పటికే గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ పేరుతో మడత బెట్టే ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

చైనా మొబైల్ దిగ్గజం హువావేతోపాటు మరో సంస్థ మోటరోలా కూడా త్వరలో మడత బెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

also read సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 10... అదిరిపోయే ఫీచర్స్

తాజాగా శామ్‌సంగ్ మరో కొత్త మోడల్ మడత బెట్టే ఫోన్‌ను తీసుకు రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న శామ్‌సంగ్ డెవలపర్స్ సదస్సులో కంపెనీ ఈ ప్రకటన చేసింది. గతంలో వచ్చిన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ మోడల్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ ఫోన్‌ను అడ్డంగా కూడా మడతబెట్టవచ్చు. పూర్తిగా తెరిచినప్పుడు ట్యాబ్‌లాగా వాడుకోవచ్చు. 

కానీ ఇప్పుడు రాబోయే కొత్త మోడల్ పొడవాటి డిస్‌ప్లేతో నిలువుగా మడతబెట్టేలా  రూపొందించనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది. మడత బెట్టినప్పుడు చేతిలో ఇమిడిపోయేలా తెరిచినప్పుడు పొడవాటి డిస్ ప్లేతో అట్రాక్టివ్‌గా ఉంటుంది. 

also read బడ్జెట్‌లోనే షియోమీ 5 కెమెరాల ఫోన్

దీనికి సంబంధించిన జిఫ్ వీడియోలను కంపెనీ ఇంటర్నెట్‌లో ప్రవేశపెట్టింది. కానీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం తెలియరాలేదు. మోడల్ నంబర్ ఎస్ఎం-ఎఫ్ 700ఎఫ్ గా పిలిచే ఈ ఫోన్ 256 జీబీ అంతర్గత స్టోరేజీ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ తరహాలో నిలువుగా మడతబెట్టే ఫోన్‌ను మోటరోలా కూడా తీసుకురానున్నది.