Asianet News TeluguAsianet News Telugu

ప్రతిభకు పట్టం కడతాం.. ఉద్యోగాల్లో కోత ఒట్టిదే: శామ్‌సంగ్

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల దాటికి తట్టుకోలేక ఫోన్ల ధరలను తగ్గించినందుకు పడిపోయిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెట్టినట్లు వచ్చిన వార్తలను శామ్ సంగ్ ఖండించింది. భారతదేశంలో ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపింది. వచ్చేనెల ఏడో తేదీన శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్రో మోడల్ ఫోన్లను న్యూయార్క్ కేంద్రంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నది. 

Samsung preparing to lay off 1,000 employees in India [Updated]: Samsungs official response
Author
New Delhi, First Published Jul 3, 2019, 10:56 AM IST

న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీల దెబ్బకి దక్షణకొరియా దిగ్గజం శామ్‌సంగ్‌ ఇండియాలో వెయ్యికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుందన్న వార్తలపై  సంస్థ స్పందించింది. ఇవి తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. పైగా మరింత మంది ప్రతిభావంతులను  ప్రోత్సహించనున్నామని పేర్కొంది. 

 

పెట్టుబడులు కొనసాగుతాయని వెల్లడి
భారతదేశంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయనీ, దేశీయ టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సిద్ధమైన తర్వాత 5జీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని తెలిపింది. ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందని శామ్‌సంగ్‌ ప్రకటించింది. 

 

వ్యాపారం విస్తరిస్తామన్న శామ్ సంగ్
భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తామని, ఇందుకోసం పెట్టుబడులు పెడుతూనే ఉంటామని  శామ్‌సంగ్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్ అండ్ డీలో పెట్టుబడులు, 5జీ నెట్‌వర్క్ వంటి కొత్త వ్యాపారాల అన్వేషణకు ఉపయోగిస్తామన్నారు. 

 

పెట్టుబడుల పెంపునకు అనుగుణంగా కొలువులు
ఈ క్రమంలోనే గతేడాది 2వేలకు పైగా కొత్త కొలువులను ఆఫర్‌ చేశామంటూ మంగళవారం శామ్‌సంగ్ వివరణ ఇచ్చింది. ఇండియాలో తమ వ్యాపారం విస్తరిస్తున్న క్రమంలో ఉద్యోగాల కల‍్పనలో తమ​ పాత్ర ఉంటుందన్నారు.

 

నిపుణులకు ఉద్యోగావకాశాలు ఫుల్
దీర్ఘకాలిక వ్యాపార విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని శామ్‌సంగ్ ప్రతినిధి తెలిపారు. భారత మార్కెట్ తన 5జీ టెక్నాలజీ రానున్న నేపథ్యంతో తాము నైపుణ్యం గల ఉద్యోగులకు ఏడాది పొడవునా ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు.

 

భారత్‌లోఆన్ లైన్ ఫోన్ విక్రయాలు 40%
భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల ఆన్ లైన్ విక్రయాల్లో ఒక ప్రధాన సమస్య వచ్చి పడింది. ఆన్ లైన్ విక్రయాల్లో 40 శాతం స్మార్ట్ ఫోన్లు, 30 శాతం స్మార్ట్ టీవీలది. వీటిల్లో చైనా స్మార్ట్ ఫోన్, టీవీ సంస్థలు ముందు వరుసలో ఉ్నాయి. 

 

ఆన్‌లైన్ సేల్స్‌లో షియోమీ ఫస్ట్
ఇటీవలి కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం ఆన్ లైన్ సేల్స్‌లో షియోమీ వాటా 43 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 15 శాతంతో శామ్ సంగ్ రెండో స్థానంలో నిలిచింది. నూతన ప్రొడక్టుల్లోకి, వివిధ క్యాటగిరీల్లోకి ప్రవేశిస్తూ మార్కెట్ వాటాను కన్సాలిడేట్ చేసుకోవడానికి శామ్ సంగ్ చర్యలు చేపట్టిందని తెలిపింది. మరో ఏడాది రికార్డులు నెలకొల్పగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. 

 

ఆగస్టు 7న విపణిలోకి గెలాక్సీ నోట్ 10, నోట్ 10ప్రొ
శామ్‌సంగ్‌ వచ్చేనెల ఏడో తేదీన నోట్‌ 10, నోట్‌ 10 ప్రొను న్యూయార్క్‌‌లో అధికారికంగా లాంచ్‌ చేయనున్నట్లు మంగళవారం శామ్‌సంగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు వెర్షన్ల ఫోన్లు కూడా దాదాపుగా గెలాక్సీ ఎస్‌ 10, ఎస్‌10+ లకు సమానంగా ఉండనున్నాయి. ఆగస్టు ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు గెలాక్సీ నోట్ 10, నోట్ 10ప్రొ లను విడుదల చేయనున్నది.

 

ఇవీ గెలాక్సీ నోట్‌ 10 ఫీచర్లు
6.3 ఇంచ్‌ డిస్‌ప్లే గల శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10 ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 885/ఎగ్జినోస్ 9 సిరీస్ 9820 చిప్‌సెట్‌, ట్రిపుల్‌ రేర్‌ కెమెరా, పంచ్‌ హోల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి. ఇంకా ప్రైమరీ అల్ట్రావైడ్‌ టెలిఫొటో, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఏర్పాటు చేశారు. 

 

గెలాక్సీ నోట్‌ 10ప్రోలో ఇలా 
శామ్ సంగ్ గెలాక్సీ 10 ప్రో మోడల్ ఫోన్‌లో 6.75 ఇంచ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ట్రిపుల్‌ రేర్‌ కెమెరా ప్లస్ పంచ్‌ హోల్‌ ఫ్రంట్‌ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ కూడా ఉంటుంది. యూఎఫ్‌ఎస్‌ 3.0 స్టోరేజ్‌తోపాటు 4,500 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ అమర్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios