హైదరాబాద్: నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం వినియోగదారులకు ఆన్‌లైన్‌ సేవలందించేందుకు జియో‌మార్ట్‌ శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ తన ఆన్‌లైన్ ఈ-కామర్స్ వేదిక ‘జియో మార్ట్’ ను శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 

ఈ రెండు రాష్ట్రాల్లో తొలుత ఎంపిక చేసిన 30 పట్టణాల్లో జియో మార్ట్  సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి లలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యురు, అనంతపురం, నర్సరావుపేట, భీమవరం, విజయనగరంలో నివసించే వారు కిరాణా వంటి నిత్యావసర వస్తువులను జియో మార్ట్ నుంచి పొందవచ్చు. 

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జియోమార్ట్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. ప్రజలకు తమకు అవసరమైన ఆహార, ఆహారేతర వస్తువులు, పండ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు లాంటి బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, అంట్లు శుభ్రం చేసుకునేవి లాంటి వస్తువులను అందుబాటులో ఉంటాయని జియోమార్ట్ ప్రకటించింది. 

వస్తువుల గరిష్ట అమ్మకం ధరకన్నా 5 శాతం తక్కువ ధరకు వస్తువులను అందిస్తామని జియోమార్ట్ పేర్కొంది. ఇక వస్తువుల డెలివరీ కూడా చెప్పిన గడువు కన్నా ముందుగానే తక్కువ సమయంలోనే డెలివరీ చేస్తామని తెలిపింది.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన ఏజీఎంలో ఈ –కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ జియో మార్ట్ గురించి ముకేశ్ అంబానీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే దేశ వ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో తెచ్చింది. తర్వాత క్రమంలో మరిన్ని పట్టణాలు, నగరాలకు విస్తరిస్తామని జియోమార్ట్‌ ప్రకటించింది.