న్యూఢిల్లీ: అత్యధిక వేగంతో కూడిన 4జీ సేవలతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో, అంతే వేగంతో మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్ని మూడేళ్లలోపే అధిరోహించింది. జూన్‌లో 33.13 కోట్ల మొబైల్‌ కనెక్షన్లతో జియో ఈ ఘనత సాధించింది. 2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. దీని ప్రకారం మూడేళ్లలోపే దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్‌ జియో అవతరించింది.

జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు.. వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు
ఈ ఏడాది జూన్‌లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా, వొడాఫోన్‌ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఆయా సంస్థల ఆర్థిక ఫలితాల్లోనే ఈ గణాంకాలు నమోదయ్యాయి. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో 33.41 కోట్ల కనెక్షన్లు వొడాఫోన్‌ ఐడియాకు ఉండగా, జూన్‌ త్రైమాసికం చివరకు కనెక్షన్లు 32.0 కోట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. 

షరతులతో వొడాఫోన్ ఐడియాకు కస్టమర్లు మంగళం
ప్రతినెలా కనీస రీఛార్జి చేసుకుంటేనే, ఇన్‌కమింగ్‌ సేవలు లభిస్తాయనే షరతు విధించడం వల్లే కనెక్షన్లు తగ్గాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. వాస్తవానికి వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ సంస్థల విలీనంతో ఏర్పాటైన వొడాఫోన్‌ ఐడియాకు 40 కోట్లకు పైగా కనెక్షన్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. ఐడియా, వొడాఫోన్ విలీనమైనా మొదటి స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ప్రతినెలా చందాదార్లను కోల్పోతూ రావడం వల్లే, ప్రస్తుతం రెండోస్థానానికి పరిమితమైంది.

మే నెలలోనే రెండో స్థానానికి రిలయన్స్ జియో
ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో గత మే నెలలోనే భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించి, రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. మే నెలలో 32.29 కోట్ల కనెక్షన్లతో 27.80  మార్కెట్‌ వాటాను సంస్థ సాధించిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ నెలలో ఎయిర్‌టెల్‌ కనెక్షన్లు 32.04 కోట్లు కాగా, 27.6 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.

వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.4,874 కోట్లు
వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,873.90 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.4,881.90 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్‌ గ్రూపు, ఐడియా సెల్యులార్‌లు గతేడాది ఆగస్టు 31న విలీనమయ్యాయి. 

మార్చి త్రైమాసికంతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన నష్టం
అందువల్ల క్రితం ఆర్థిక సంవత్సరం జూన్‌ ఫలితాలతో వీటిని పోల్చి చూడలేమని కంపెనీ పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా ఆదాయం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.11,269.9 కోట్లు కాగా, క్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.11,775 కోట్లుగా నమోదైంది. 

2020-21 నుంచి గాడిలో పడతామన్న వొడాఫోన్ ఐడియా సీఈఓ
‘2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి కంపెనీ గాడిలో పడుతుంది. ప్రస్తుతం మేము అనుసరిస్తున్న వ్యూహాలు ఇంకా ఫలితాలను ఇవ్వలేదు. మా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విషయంలో మెరుగుపడ్డాం. మా నెట్‌వర్క్‌లను ఏకీకృతం చేసే ప్రక్రియ కొనసాగుతోంద’ని వొడాఫోన్‌ ఐడియా సీఈఓ బాలేశ్‌ శర్మ చెప్పారు. 

33.41 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గిన కస్టమర్లు
‘సమీక్షా త్రైమాసికంలో రూ.2,840 కోట్లు ఖర్చు చేశాం. 2019 జూన్‌ 30 నాటికి స్థూల రుణం రూ.12,044 కోట్లు ఉంది’ అని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. చందాదారులు 33.41 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గారు.