రియల్ మీ తాజాగా Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ విశేషాలు ఇలా ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..! 

చైనీస్ టెక్ కంపెనీ రియల్ మీ తాజాగా చేపట్టిన ఈవెంట్ సందర్భంగా Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కంపెనీ Realme GT Neo 3 అనే మరొక స్మార్ట్‌ఫోన్‌ అలాగే Realme Buds Air 3 ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది. రియల్ మీ ఇటీవలే Realme GT Neo 3ను ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నియో 3 సిరీస్‌ని విస్తరిస్తూ Realme GT Neo 3Tని జాబితాలో చేర్చింది.

Realme GT నియో 3T డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ అనే మూడు కలర్ ఛాయిస్ లలో లభించనుంది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ కు సంబంధించి రెండు ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. 80W లేదా 150W ఛార్జింగ్ కెపాసిటీలలో ఎంచుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో డిస్‌ప్లే పైన ఎగువ-ఎడమ మూలలో సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. దీని ఎడమ అంచులో వాల్యూమ్ అప్, డౌన్ బటన్‌లు ఉన్నాయి. కుడి వైపు పవర్ బటన్ ఉంటుంది. హ్యాండ్ సెట్ దిగువన SIM స్లాట్, మైక్రోఫోన్, USB-C పోర్ట్ అలాగే స్పీకర్ గ్రిల్ ఉండటం గమనార్హం.

Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.62 అంగుళాల AMOLED డిస్‌ప్లే

- 8 GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యం

- స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్

- వెనకవైపు 64 MP+ 8MP + 2MP ట్రిపుల్ సెట్ కెమెరా, డ్యుఎల్ ఫ్లాష్. ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W/ 150W ఫాస్ట్ ఛార్జర్

- ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS, NFC, USB-C పోర్ట్, గేమ్‌లో వైబ్రేషన్‌ల కోసం X-యాక్సిస్ లీనియర్ మోటార్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. అయితే 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ లేదు.

ధర, రూ. 5,499,000

ధరను చూస్తే కళ్లు చెదిరాయి కదా? కంగారు పడకండి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల చేసింది కాబట్టి ఇండోనేషియన్ రూపాయ ప్రకారం ఆ ధర ఉంది. దీనిని భారతీయ కరెన్సీలోకి మారిస్తే సుమారు రూ. 30 వేలు. అయితే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.