న్యూఢిల్లీ: భారత్‌లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మేక్‌ ఇన్‌ ఇండియా పథకంపై చైనా టెక్‌ దిగ్గజ సంస్థ ఒప్పో దృష్టిపెట్టింది. భారత్‌లోని యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు, ఉత్పత్తులను రూపొందిస్తోంది. భారత ప్రజల జీవనశైలికి తగినట్టుగా రూపకల్పనతోపాటు ఇక్కడి స్టార్టప్‌లకు సహకారం అందించేందుకు సన్నద్ధమవుతోంది. మేక్‌ ఇన్‌ ఇండియానే ప్రధాన ఆధారంగా చేసుకుని భారత్‌లో సంస్థను పరుగులు పెట్టించాలని భావిస్తోంది.

వచ్చే ఏడాది ముగిసేసరికి పది కోట్ల స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పో సంస్థ ఇటీవల ప్రకటించింది. వాటితోపాటు ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు వివిధ ఉత్పత్తుల్ని భారత వినియోగదారులకు అందిస్తామని చెబుతోంది.

also read మార్కెట్ లోకి కొత్త బ్లూటూత్ స్పీకర్...10 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్
 
దేశంలో మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)పై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఒప్పో వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆర్‌డీ) తస్లీం ఆరిఫ్‌ తాజాగా ప్రకటించారు. 5జీ ఉత్పత్తులకు భారత్‌ ఒక నమ్మకమైన మార్కెట్‌ అని ఆయన అభివర్ణించారు. 

నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ (ఎన్‌డీసీపీ) ద్వారా ఇక్కడి ప్రభుత్వం పరిశ్రమలో ఆశావహ పరిస్థితుల్ని కల్పిస్తోందని ఒప్పో వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆర్‌డీ) తస్లీం ఆరిఫ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తమ ఆర్‌ అండ్‌ డీ కేంద్రంలో ఇప్పటికే 5జీపై పరిశోధనలు ప్రారంభించామన్నారు.

also read కొత్త ఆడియో పార్టీ స్పీకర్స్ లాంచ్... అతి తక్కువ ధరకే..

వీలైనంత త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నామని ఒప్పో వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆర్‌డీ) తస్లీం ఆరిఫ్‌ వెల్లడించారు. గత కొన్ని నెలలుగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తీవ్రంగా మందగించడంతో.. భారీ మార్కెట్‌ కలిగిన భారత్‌ పలు సంస్థలకు కీలక మార్కెట్‌గా మారింది.
 
దేశంలో సుమారు 50 కోట్ల మంది ఇంకా ఫీచర్‌ఫోన్లనే వాడుతున్నారని అంచనా. అందుకే ఇక్కడున్న భారీ అవకాశాలను ఒడిసిపట్టాలని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ఐడీసీ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో ఒప్పో 11.8 శాతం వాటాను దక్కించుకోగలిగింది. గత ఏడాదితో పోలిస్తే. 92.3 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.