న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇండియన్ ఆలీబాబా అవతారం ఎత్తనున్నారు. దేశీయంగా డిజిటల్‌ సేవల వ్యాపార విషయంలో ముకేవ్ అంబానీ.. చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా, సెర్చింజన్ గూగుల్ ఆల్ఫాబెట్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. చైనాకు చెందిన అలీబాబా గ్రూపు ఈ-కామర్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సహా తదితర టెక్నాలజీ సేవల విభాగాలన్నీ ప్రత్యేక హోల్డింగ్‌ కంపెనీ ద్వారా నిర్వహిస్తోంది. 

తద్వారా పారిశ్రామిక దిగ్గజం​ ముఖేష్‌ అంబానీ చైనాలో అలీబాబా తరహాలో భారత్‌లో ఈకామర్స్‌ దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్‌లో కీలక వాటా దక్కించుకోవాలన్న తన కలను పండించుకునేందుకు రూ 1.73 లక్షల కోట్లతో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నారు.

also read బడ్జెట్‌లోనే షియోమీ 5 కెమెరాల ఫోన్

నాలుగేళ్ల క్రితం గూగుల్‌ ప్రమోటర్లూ అదే పనిచేశారు. గూగుల్‌తోపాటు ఇతర విభాగాలన్నీ నిర్వహణ కోసం 2015 అక్టోబర్ నెలలో ఆల్ఫాబెట్‌ పేరుతో మాతృ సంస్థను ఏర్పాటు చేశారు. ముకేశ్‌ అంబానీ సైతం అదే తరహాలో డిజిటల్‌ సేవల కోసం ప్రత్యేక హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నట్లు గతవారం ప్రకటించారు.

భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌కు దీటైన ఈ-కామర్స్‌ వ్యాపారాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న అంబానీ వేసిన మరో కీలక అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌తోపాటు మిగతా డిజిటల్‌ సేవల విభాగాలను ఈ హోల్డింగ్‌ కంపెనీ ద్వారా నిర్వహించనున్నారు. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు పూర్తి అనుబంధ విభాగంగా ఈ హోల్డింగ్‌ కంపెనీ ఏర్పాటు కానుంది. ఇందులో ఆర్‌ఐఎల్‌ ఆప్షనల్లీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో రూ.1.08 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. 

హోల్డింగ్‌ కంపెనీ తిరిగి ఆ నిధులను రిలయన్స్‌ జియోలో పెట్టుబడిగా పెట్టనుంది. దాంతో 2020, మార్చి నాటికి జియో రుణరహిత కంపెనీగా మారనుంది. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్‌ జియోతోపాటు రిటైల్‌ వ్యాపారాన్ని పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు తీసుకు రానున్నట్లు ఆగస్టులో జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సమావేశంలో అంబానీ తెలిపారు. 

also read వచ్చేసింది ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో.... ధర ఎంతో తెలుసా ?

ఐపీఓ వ్యూహాల్లో భాగంగానే జియోను పూర్తి రుణరహిత కంపెనీగా మారుస్తున్నట్లు, వ్యూహాత్మక ఇన్వెస్టర్ల పాలిట సంస్థను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్‌ ఏర్పాటు చేయబోయే ఈ హోల్డింగ్‌ కంపెనీ దేశంలో అతిపెద్ద డిజిటల్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ కానుంది. 

ఈ సంస్థ విద్య, వైద్య సంబంధిత సాంకేతికతలతోపాటు కృత్రిమ మేధ(ఏఐ), బ్లాక్‌ చైన్‌, వర్చువల్‌ అండ్‌ అగ్మెంటెడ్‌ రియాల్టీ వంటి ఆధునిక టెక్నాలజీ సేవలపైనా దృష్టిపెట్టనుంది. ఈ హోల్డింగ్‌ కంపెనీ ఆధ్వర్యంలో రిలయన్స్‌కు చెందిన మైజియో, జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌, జియో సావన్‌ వంటి డిజిటల్‌ యాప్‌లు సైతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

చమురు పెట్రోకెమికల్‌ గ్రూప్‌తో లాభాల వేటలో ముందున్న ఆర్‌ఐఎల్‌ను రానున్న రోజుల్లో వృద్ధి బాటన పరుగులు పెట్టించేందుకు డేటా, డిజిటల్‌ సర్వీసులపై ముఖేష్‌ అంబానీ దృష్టిసారించారు. అమెజాన్‌, వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో తలపడేందుకు భారీ పెట్టుబడులతో ఈకామర్స్‌ ఫ్లాట్‌ఫాం ముఖేష్‌ అడుగుపెడుతుండటంతో ఈ-మార్కెట్‌లో రసవత్తర పోరుకు తెరలేవనుంది. 

రిలయన్స్‌ రాబడుల్లో ప్రస్తుతం 32 శాతంగా ఉన్న రిటైల్‌ సహా నూతన వ్యాపారాలు రానున్న కొన్నేళ్లలో దాదాపు సగానికి పెరుగుతాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ముఖేష్‌ అంబానీ పేర్కొనడం గమనార్హం. ఈకామర్స్‌ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు కొన్ని సంస్థల్లో వాటా కొనుగోళ్లు, స్వాధీనాలపైనా ముఖేష్‌ కసరత్తు సాగిస్తున్నారు. ఈకామర్స్‌ ప్రణాళికల దిశగా వ్యూహాత్మక భాగస్వాములు ఆసక్తి కనబరిచారని ముఖేష్‌ అంబానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.