దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. దాదాపు 25 లక్షల మంది ఎయిర్‌టెల్ యూసర్ల డాటాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. అంతేకాకుండా హ్యాకర్లు ఆ డాటాను అమ్మకానికి పెట్టారు.

దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులలో ఆందోళన మొదలైంది. హ్యాకర్లు హ్యాక్ చేసిన డాటాలో యూసర్ల  చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నంబర్ , జెండర్ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లు  ఉన్నాయి.  

 హ్యాకర్లు  భారతదేశంలోని ఎయిర్‌టెల్ వినియోగదారులందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఆ డేటాను విక్రయించాలనుకుంటున్నట్లు  పేర్కొన్నారు.

ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ సమాచారాన్ని వెల్లడించారు. హ్యాకర్లు ఎయిర్‌టెల్ భద్రతా బృందాలతో కూడా సంప్రదించి, ఆ సంస్థను బ్లాక్ మెయిల్ చేసి వారి నుండి 3500 డాలర్ల బిట్‌కాయిన్లను  వసూలు చేయడానికి ప్రయత్నించారని తెలిపాడు.

 ఈ విషయంలో హ్యాకర్లు విఫలమయ్యారని దీంతో  నిరాశలో వారు వెబ్‌లో అమ్మకానికి డేటాను పెట్టారని దాని కోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా సృష్టించి అందులో వినియోగదారు వివరాల నమూనాను చూపించినట్లు వెల్లడించారు.

ఎయిర్‌టెల్ సిస్టమ్స్ లేదా సర్వర్‌ల నుండి డేటా లీక్ అయి ఉండకపోవచ్చని  కానీ  ఇతర మార్గాల ద్వారా హ్యాక్ చేసి  ఉండవచ్చు. ఈ లీక్ అయిన 25 లక్షల యూసర్ల డాటా  జమ్మూ & కె ప్రాంతంలోని చందాదారులవి అని తెలుస్తుంది.

రాజాహారియా ప్రకారం హ్యాకర్లు జనవరి 2021లో 25 లక్షల ఎయిర్‌టెల్ చందాదారుల డాటా వివరాలను ఒక నమూనాగా అప్‌లోడ్ చేసారు. ఇందుకు సంస్థ నుండి డబ్బును  డిమాండ్ చేయడానికి ప్రయత్నించారు అని ఆయన అన్నారు.

దీనిపై ఎయిర్‌టెల్ స్పందిస్తూ  ఒక ప్రకటనలో, "ఎయిర్‌టెల్ తన వినియోగదారుల గోప్యతను కాపాడటానికి వివిధ చర్యలను తీసుకుంటుందని మా  వద్ద నుంచి ఎలాంటి డేటా బయటకి లీక్ కాలేదని, హ్యాక్ అయిన డేటా రికార్డులలో ఎక్కువ భాగం ఎయిర్‌టెల్‌కు చెందినవి కావు. మేము ఇప్పటికే ఈ యొక్క సంబంధిత అధికారులకు తెలియజేసాము. " అని తెలిపింది.