న్యూయార్క్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రముఖులు భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా కొవిడ్‌-19 నివారణ కోసం అవసరమైన ఔషధాన్ని కనుగొనేందుకు పరిశోధనలు చేయడానికి బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్​కు 25 మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నట్లు ఫేస్‌బుక్ అధినేత మార్క్‌జుకర్‌బర్గ్‌ దంపతులు ప్రకటించారు. 

టెక్ దిగ్గజ కుబేరుల నుంచి భారీ మొత్తం వచ్చిన విరాళాల్లో ఇదొకటి. 
కరోనా వైరస్‌ నివారణకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసికట్టుగా పనిచేస్తామని జుకర్‌బర్గ్‌ ఉద్ఘాటించారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనే మందును కనుగొనటమే తమ ముందున్న లక్ష్యమని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఇప్పటికే కొన్ని రకాల మందులను పరీక్షించగా, కరోనా వైరస్‌ను తగ్గించటానికి కొంతమేర అవి పనిచేస్తున్నాయని జుకర్‌బర్గ్‌ చెప్పారు. జుకర్ బర్గ్ దంపతులు చాన్ జుకర్ బర్గ్ ఇన్షియేటివ్ (సీజడ్ఐ) పేరుతో నిర్వహిస్తున్న దాత్రుత్వ సంస్థ ద్వారా ఈ విరాళాన్ని అందజేశారు. 

also read:మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు

కొవిడ్‌-19పై పోరాడేందుకు ఈ నెల ప్రారంభంలోనే బిల్ అండ్​ మిలిందా గేట్స్ పౌండేషన్‌ 50 మిలియన్ డాలర్లతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. 125 మిలియన్ డాలర్ల నిధి అవసరమని ఈ ఫౌండేషన్ భావించింది. అందరికీ అందుబాటు ధరలో చికిత్స అందాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టు ప్రాంరంభించినట్లు ఫౌండేషన్ పేర్కొంది. కరోనా కట్టడికి మిలిందా పౌండేషన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ కలిసి పనిచేస్తుండటం గమనార్హం.

తాజాగా చాన్ జుకర్ బర్గ్ ఇన్షియేటివ్ ద్వారా మార్క్ జుకర్ బర్గ్ దంపతులు అందజేస్తున్న విరాళంతో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్.. కొవిడ్-19పై పోరుకు 125 మిలియన్ల డాలర్లు సమకూరినట్లయింది. కరోనా వైరస్ మీద పోరు చేయడానికి ఫేస్ బుక్ అందజేస్తున్న రెండో విరాళం ఇది. 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్‌లతోపాటు పలు టెక్నాలజీ దిగ్గజ సంస్థలు కూడా ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని పరిగణలనోకి తీసుకుని పోరు చేసేందుకు సిద్ధమయ్యాయి. 

ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్, ఫేస్ బుక్ విడివిడిగా 100 మిలియన్ల డాలర్ల నిధులను విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిధిని క్రియేటివ్ కమ్యూనిటీ, స్మాల్ బిజినెస్‌లు నడిపే వారికి నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్ ఖర్చు చేయనున్నాయి. డిట్టో ఫర్ సిస్కో సంస్థ మరో అడుగు ముందుకేసి 225 మిలియన్ల డాలర్ల మేరకు తమ ఉత్పత్తుల ద్వారా సేవలందించనున్నట్లు తెలిపింది.