Asianet News TeluguAsianet News Telugu

మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు

టాటాలు తమకు మనస్సు ఉందని మరోసారి రుజువు చేసుకున్నారు. కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ టాటాలు పెద్ద మనసుతో స్పందించారు.

"Need Of The Hour": Ratan Tata Commits 1,500 Crores To Fight COVID-19
Author
New Delhi, First Published Mar 29, 2020, 10:33 AM IST

ముంబై: టాటాలు తమకు మనస్సు ఉందని మరోసారి రుజువు చేసుకున్నారు. కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ టాటాలు పెద్ద మనసుతో స్పందించారు. గతంలో ఏ కార్పొరేట్‌ సంస్థ చూపని ఔదార్యం ప్రదర్శించారు. టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్ట్స్‌ రూ.500 కోట్ల చొప్పున సాయం అందజేయనున్నట్లు తెలిపాయి.

కరోనా మహమ్మారి నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత సంరక్షణార్థం, పెరుగుతున్న రోగుల శ్వాసకోశ ఇబ్బందుల చికిత్స కోసం, కొత్త కేసుల నిర్ధారణ నిమిత్తం, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంపు, హెల్త్‌ వర్కర్లకు శిక్షణ కోసం కూడా ఈ నిధులను ఖర్చు చేస్తామని టాటా ట్రస్ట్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనాపై టాటా ట్రస్ట్స్‌, టాటా సన్స్‌, టాటా గ్రూప్‌ సంస్థలు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతాయని వెల్లడించింది. 

ఈ కష్ట కాలంలో నిరుపేదలకు అండగా ఉందామని టాటా సన్స్, టాటా ట్రస్ట్ అభ్యర్థించాయి. ‘ప్రస్తుతం భారత్‌లో, మరికొన్ని దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని కలిసికట్టుగా ఎదుర్కొని విజయం సాధిద్దాం’ అని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పిలుపునిచ్చారు. 

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తక్షణం స్పందించాల్సిన అవసరం ఉన్నది. టాటా ట్రస్ట్స్‌, టాటా గ్రూప్‌ సంస్థలు గతంలో ఎన్నోసార్లు ఆపత్కాలంలో అభాగ్యులకు అండగా నిలిచాయి’ అని పేర్కొన్నారు.

‘ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పుడు సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషమ సమయంలో కలిసికట్టుగా శ్రమించాలి. మానవ జాతి మనుగడకే సవాల్‌ విసురుతున్న ఈ మహమ్మారి అంతానికి చేతనైన కృషి చేద్దాం’ అని టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ రతన్‌ టాటా పిలుపునిచ్చారు. 

మరోవైపు ఆటో రంగ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా కరోనా వైరస్‌ నిర్ధారణ కిట్లను దక్షిణ కొరియా నుంచి తెప్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అత్యాధునిక టెస్టింగ్‌ కిట్లతో త్వరగా రోగ నిర్ధారణ జరుగుతుందని, 25వేల మందినిపైగా పరీక్షించవచ్చని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీటిని అందజేస్తామని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహనాల వారెంటీ, ఉచిత సేవలు తదితర సౌకర్యాల కోసం రెండు నెలల సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ఇక కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్‌ తమ దవాఖానలను కరోనా బాధితుల చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని శనివారం ప్రకటించింది. ఇప్పటికే 45 ఆస్పత్రులు, హెల్త్‌ యూనిట్లను ఇందుకోసం ఎన్టీపీసీ కేటాయించింది. ఇప్పుడు మొత్తం దవాఖానలను వైరస్‌ నిర్మూలనకు అంకితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తాజా వివరాల ప్రకారం ఈ దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు కలిగిన 121 పడకలు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

మరో కేంద్ర ప్రభుత్వ రంగ జలవిద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ.. కరోనాపై పోరుకు రూ.4.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ కష్ట కాలంలో జాతికి అండగా నిలిచేందుకు తమ వంతు సాయంగా ఈ విరాళం అందిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఏకే సింగ్‌ తెలిపారు. ఉద్యోగుల వాటా రూ.1.36 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తమ పవర్‌ స్టేషన్లు, ప్రాజెక్టుల సమీపంలోని స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తామన్నారు. 

ప్రభుత్వరంగ సంస్థలు, చిరు వ్యాపారుల సహాయార్థం ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌ రూ.6వేల కోట్ల (800 మిలియన్‌ డాలర్లు)ను ప్రకటించింది. ప్రకటన రుణాలు (యాడ్‌ లోన్స్‌), లోన్ల రూపంలో ఈ విరాళం మొత్తాన్ని అందిస్తామని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థసహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కుపైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్‌ డాలర్ల విలువైన ప్రకటన రుణాలను ఇస్తామన్నారు. 

నిరుపేదల అవసరాల నిమిత్తం ఐటీసీ రూ.150 కోట్లతో ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. మునుపెన్నడూ లేని ఓ విపత్తు యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నదని ఈ సందర్భంగా ఐటీసీ ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో ఆర్థికంగా ఎంతోమంది వెనుబడినవారున్నారని, వారి కోసం రూ.150 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఔషధాలు, పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసరాలు, వ్యవసాయోత్పత్తులను అందిస్తామన్నది.

అగ్వా హెల్త్‌కేర్‌తో కలిసి వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతుండగా, వెంటిలేటర్ల కొరత రాకుండా తమ వంతు సాయం చేస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. వెంటిలెటర్ల తయారీ కోసం మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ కూడా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios