న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల విలీనానికి గాను గరిష్టంగా రెండేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. గత నెల 23వ తేదీన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ఈ రెండు సంస్థల పునరుద్ధరణ ప్రణాళికకు సమ్మతించిందని టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఈ ప్రణాళికలో భాగంగా రెండు సంస్థల విలీనానికీ క్యాబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ విలీనం ప్రక్రియ పూర్తయ్యేందుకు 18 నెలలుగా, రెండేళ్ల  సమయం పట్టే అవకాశం ఉందని ఆయన లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 

ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎంటీఎన్‌ఎల్‌ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాగా, ఈ రెండు సంస్థల్లో ప్రకటించిన వీఆర్‌ఎస్‌ ప్రతిపాదనకు ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

also read  IT layoffs: ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు...ఎందుకంటే ?

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు 78 వేల మంది ఎంప్లాయిస్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు 13,532కు చేరినట్లు అధికారులు తెలిపారు. 

వీఆర్‌ఎస్‌ గడువు ముగిసేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే రెండు సంస్థల్లో కలుపుకొని దాదాపు 91వేల మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడంతో సర్కారుకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద 50 ఏళ్లు పైబడిన కొంత మంది ఉద్యోగులు రూ. 90 లక్షలు ప్యాకేజీ పొందే అవకాశం ఉంది. 

దీంతో 50 ఏళ్లు దాటిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల చేపట్టిన స్వచ్ఛంద పదవి విరమణ పథకం ప్రకారం 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల ఉద్యోగులను పదవీ విరమణ పథకానికి అర్హులని ప్రకటించింది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేస్తున్న 1.6 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం 63శాతం అంటే లక్ష మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 

ఇప్పటికే రెండు వారాల్లోనే ఈ పథకానికి దాదాపు 80వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీఆర్ఎస్ పథకం వచ్చేనెల 3వ తేదీ వరకు అవకాశం ఉండడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీఎస్ఎన్‌ఎల్‌లో ఉద్యోగులకు ప్రస్తుత పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు. 

55 ఏళ్లు నిండిన వారికి వీఆర్‌ఎస్‌ పథకం కింద మిగిలిన ఐదేళ్ల కాలానికి జీతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రసుత్తం వీఆర్‌ఎస్‌ పొందే ఉద్యోగులు జీతంతో పాటు అదనంగా పొందనున్న పదవీ విరమణ ప్యాకేజీతో లక్షాధికారులుగానే రిటైర్‌ అవ్వనున్నట్లు తేలింది. 

also read  లక్ష్యం దిశగా బీఎస్ఎన్ఎల్.. వీఆర్ఎస్ @ 75 వేలు

ఎందుకంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ నెలవారీ జీతం బడ్జెట్ సుమారు రూ .1,200 కోట్లు ఉండగా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వ్యక్తులు నెలకు కనీసం రూ. 75,000 జీతం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ఎంచుకున్న 50 ఏళ్ల వయస్సు ఉన్న కొంతమంది ఉద్యోగులు రూ .90 లక్షల విరమణ ప్యాకేజీని పొందే అవకాశం ఉంది.

ఉదాహరణకు ఒక 50 ఏళ్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి  సుమారు 75,000 రూపాయలు సంపాదిస్తున్నారని అనుకున్నా, వీఆర్‌ఎస్‌ తీసుకుంటే ఇంకా 10 సంవత్సరాల సేవ మిగిలి ఉంటుంది. దీంతో సదరు ఉద్యోగికి ఆ మొత్తం కాలానికి వేతనంతో పాటు ప్యాకేజీ లభించే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా, 59 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగి వీఆర్‌ఎస్‌ను ఎంచుకుంటే సుమారు రూ.9 లక్షల రూపాయలు పొందుతారు. అయితే పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల జీతానికి రక్షణ ఉంటుందని, కేబినెట్ నిర్ణయం ప్రకారం వారికి పూర్తి జీతం లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.