Asianet News TeluguAsianet News Telugu

పారా హుషార్! ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కు సప్త సూత్రాలు!!

ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం.. మీ మనీ హ్యాకర్ల చేతుల్లో పడకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో సప్త సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు ఆర్థిక వేత్తలు.. మార్కెట్ నిపుణులు.

Keep your money safe from hackers! Follow these 7 tips while using net banking
Author
New Delhi, First Published Jul 1, 2019, 11:04 AM IST

న్యూఢిల్లీ: ఈనాడు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. డిజిటల్‌ లావాదేవీలు అందరి నోట తరచుగా వినిపించే పదం. అందులోనూ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌ లావాదేవీల జోరు బాగా పెరిగింది. అందులో ప్రధానమైనది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌. దీని వల్ల పగలు, రాత్రి, పని దినాలు, సెలవు రోజులు అనే తేడా లేకుండా ఏ రోజునైనా ఏ క్షణంలో కావాలనుకుంటే ఆ క్షణంలో ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు.

ఇల్లు, ఆఫీసు సహా ఖాతాదారులు ఎక్కడుంటే అక్కడ నుంచే నిధుల బదిలీ కూడా తేలిగ్గా చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నంత సౌలభ్యంతోపాటు అంత ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఖాతాను హ్యాక్‌ చేసి అందులో సొమ్ము స్వాహా చేయవచ్చునని హెచ్చరిస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.. 

తొలిసారి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నమోదు చేసుకున్నప్పుడు ఖాతా యాక్సెస్‌ చేసుకోవడానికి బ్యాంకు ఒక పాస్‌వర్డ్‌ పంపుతుంది. దాన్ని వెంటనే మార్చి ఖాతాను భద్రం చేసుకోవడం అందరూ చేసే పనే. కానీ ఖాతా సైబర్‌ చోరుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఆ తర్వాత కూడా పాస్‌వర్డ్‌ను అప్పుడప్పుడూ మారుస్తుండాలి. ఎప్పుడూ పాస్‌వర్డ్‌ బ్రౌజర్‌ గుర్తుంచుకునే ఆప్షన్‌ ఎంచుకోవద్దు.
 
ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు బదిలీ చేసే సౌలభ్యం వల్ల కొందరు సైబర్‌ కేఫ్‌లకు కూడా వెళ్లి లాగిన్‌ అవుతూ ఉంటారు. ఇలా చేస్తే మాత్రం ఖాతా సైబర్‌ నేరగాళ్ల చేతికి పోయే అనవసర ప్రమాదం కొని తెచ్చుకున్నట్టవుతుంది.
 
బ్యాంకులు ఎప్పుడూ ఖాతాదారులు గోప్యంగా ఉంచుకోవాల్సిన వివరాలు అందించాలని కోరవు. అలా ఎవరిదగ్గర నుంచైనా ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ వచ్చినా దానికి స్పందించవద్దు. డిలీట్‌ చేసేయండి. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే లాగిన్‌ కావాలి. మీరు లాగిన్‌ అయిన యుఆర్‌ఎల్‌లో htpp// అక్షరాలున్నాయో, లేదో చూసుకోండి. ఆ అక్షరాలుంటే అది పూర్తిగా సురక్షితమైన వెబ్‌సైట్‌ అని భావించవచ్చు.
 
ఎప్పుడు ఏ లావాదేవీ జరిపినా కూడా వెనువెంటనే మీ ఖాతాలో బ్యాలెన్స్‌ వివరాలు పరిశీలించుకోండి. మీరు కోరిన మొత్తం మాత్రమే బదిలీ అయిందా, ఆ బదిలీని మినహాయించగా బ్యాలెన్స్‌ సరిగ్గానే ఉందా అన్న అంశాలు సరి చూసుకోవాలి. ఏదైనా తేడా కనిపిస్తే తక్షణం బ్యాంకుకు తెలియచేయాలి.
 
కంప్యూటర్‌పై వైరస్‌, సైబర్‌ నేరగాళ్ల దాడుల నుంచి కాపాడుకోవాలంటే చౌర్యం చేసిన యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ కాకుండా లైసెన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ మాత్రమే కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అలాగే మీకు ఆ సాఫ్ట్‌వేర్‌ అందించిన కంపెనీ ఎప్పటికప్పుడు వైరస్‌ అప్‌డేట్లు పంపుతూ ఉంటుంది. అవన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి.
 
చాలా మంది బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు పని లేనప్పుడు ఇంటర్నెట్‌ డిస్‌కనెక్ట్‌ చేయరు. దాని వల్ల హ్యాకర్లకు మీ కంప్యూటర్‌ యాక్సెస్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ డేటా సురక్షితంగా ఉండాలంటే మీకు అవసరం లేనప్పుడు ఇంటర్నెట్‌ డిస్‌కనెక్ట్‌ చేయండి.
 
ఈ-మెయిల్‌లో వచ్చే లింక్‌లు లేదా సెర్చ్‌ ఇంజన్లలో వచ్చే లింక్‌ల ద్వారా కాకుండా కేవలం బ్యాంకు అధికారిక యుఆర్‌ఎల్‌ నుంచి మాత్రమే లాగిన్‌ కావాలి. లింక్‌ల ద్వారా యాక్సెస్‌ అయితే మీ ఖాతా సైబర్‌ చోరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios