Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు నో ప్రాబ్లం.. కేంద్రానికి జియో లేఖ

దేశీయ టెలికం సంస్థలకు ఉద్దీపనలు ఇవ్వొద్దని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏజీఆర్ బకాయిలు చెల్లించే స్థోమత సదరు సంస్థలకు ఉందని వ్యాఖ్యానించింది. దీంతో జియోతోపాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య దూరం మరింత పెరిగినట్లయింది. 

jio to telecom minister : rejects telico"s financial demand
Author
Hyderabad, First Published Nov 1, 2019, 11:42 AM IST

న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో తన టెలికం ప్రత్యర్థులకు మరోమారు షాకిచ్చింది. దేశీయ టెలికం రంగం సంక్షోభంలో లేదని, ఉద్దీపనాలేవీ అక్కర్లేదని తేల్చేసింది. ఈ మేరకు గురువారం టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు జియో లేఖ రాసింది. ఆ టెలికం సంస్థల వద్ద డబ్బుకు కొరతే లేదన్నది. 

సుప్రీం కోర్టు ఇటీవలి ఆదేశాల ప్రకారం కేంద్రానికి బకాయిలు తీర్చే శక్తి వాటికి ఉందని రిలయన్స్ జియో వ్యాఖ్యానించింది. ఇదే క్రమంలో భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి, పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమను ఈ ఊబిలో నుంచి బయటపడేసే ఉద్దీపన చర్యలు ప్రసాదించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. 

also read అమ్మబాబోయ్.. ఈ -కామర్స్ సంస్థలు యమ డేంజర్!!

ఇప్పుడు వీటికి షాకిచ్చేలా కేంద్రానికి జియో లేఖ రాసింది. టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖలో జియో.. వాటి అభ్యర్థనను పట్టించు కోవద్దని, అలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించొద్దని, అలా చేస్తే మున్ముందు మరిన్ని సంస్థలు బారులు తీరుతాయని హెచ్చరించింది.

వార్షిక సర్దుబాటు స్థూల ఆదాయానికి (ఏజీఆర్) సంబంధించి టెలికం శాఖ రూపొందించిన నిర్వచనాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ తదితర టెలికం సంస్థలు.. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలను వడ్డీతోసహా చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా ఇచ్చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

jio to telecom minister : rejects telico"s financial demand

ఈ రూ.1.3 లక్షల కోట్లతోపాటు వార్షిక స్థూల రాబడి (ఏజీఆర్)పై వడ్డీతో సహా చెల్లించాలని టెలికం కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎయిర్‌టెల్‌పై దాదాపు రూ.42 వేల కోట్లు, వొడాఫోన్-ఐడియాపై సుమారు రూ.40 వేల కోట్ల భారం పడగా, జియో సైతం రూ.14 కోట్లు ఇవ్వాల్సి వస్తున్నది. ఎయిర్ టెల్ 42 వేల కోట్లలో రూ.22 వేల కోట్లు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, మిగతాది వడ్డీ, జరిమానా ఉన్నాయి. 

వొడాఫోన్ ఐడియా రూ.29 వేల కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలి. అదనంగా ఉన్న బకాయి వడ్డీ, జరిమానా. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన సీవోఏఐ.. టెలికం రంగం ఇబ్బందుల్లో ఉన్నదని, దీనిపై పునరాలోచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నష్టాల్లో ఉన్న టెలికం సంస్థలకు దన్నుగా ఉద్దీపనాలను అందించాలని కోరింది. 

also read వాయిస్ కంట్రోల్‌తో ఎంఐ స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2

దీంతో స్పందించిన జియో.. ‘‘సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్థిక ఉపశమనం కోసం సీవోఏఐ చేసిన డిమాండ్‌ను తిరస్కరించాలి. స్పెక్ట్రం చెల్లింపులు సహా అన్ని బకాయిలను మూడు నెలల్లో చెల్లించడాన్ని తప్పనిసరి చేయాలి’’ అని కేంద్రమంత్రికి లేఖ రాసింది. దీన్ని అంగీకరిస్తే అన్నిరంగాల నుంచి ఇలాంటి డిమాండ్లే వస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
 
ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలనుద్దేశిస్తూ ఏవో రెండు సంస్థలు నష్టాల్లో ఉన్నంత మాత్రాన మొత్తం భారతీయ టెలికం రంగమే ఇబ్బందుల్లో ఉన్నట్లు కాదని, బెయిలౌట్ ప్యాకేజీ అవసరం లేదని ఈ లేఖ ద్వారా ప్రభుత్వానికి జియో సూచించింది. ఇక సీవోఏఐపై జియో విమర్శల వర్షం కురిపించింది. 

సంఘం చెబుతున్నట్లు దేశీయ టెలికం రంగంలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు లేవని చెప్పింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి పాత టెలికం ఆపరేటర్లకు మద్దతిస్తూ సీవోఏఐ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నదని తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వం నుంచి అన్యాయంగా ప్రయోజనం పొందాలన్న ఎత్తుగడతో సీవోఏఐ ముందుకెళ్తున్నదని, ఆ రెండు సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని మండిపడింది. మొత్తానికి టెలికం రంగంలో కోల్డ్‌వార్.. ఈ జియో లేఖతో ముదిరినట్లెంది. 

ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీ (ఐయూసీ)ల విషయంలోనూ టెలికం రెగ్యులేటర్ ట్రాయ్‌తో జియో పోరాటం చేస్తున్నది. ఈ విధానంలో జియో చెల్లింపుదారుగా ఉంటే, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలు ఆదాయం పొందుతున్నాయి. దీంతో సదరు సంస్థలకు ట్రాయ్ సైతం మద్దతునిస్తోందని జియో ఆక్షేపిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios