న్యూఢిల్లీ: దేశీయంగా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒకటి. ఉద్యోగులకు అధిక వేతనాలిచ్చే రంగం కూడా ఇదే. ఉద్యోగుల వలసల (యాట్రిషన్‌) రేటు సైతం ఎక్కువే. ఐటీ రంగ కంపెనీలకు ఇది తొలి నుంచీ ఉన్న ఈ సమస్యైనా సాంకేతికంగా శరవేగంగా మార్పులకు లోనవుతున్న తరుణంలో వలసలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన సమస్యగా మారింది. 

ఉద్యోగులను నిలుపుకోవడంతోపాటు పరిశ్రమలో మారుతున్న అవసరాలకు తగినట్లు వారిని తీర్చదిద్దడంపై ఐటీ కంపెనీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. మిగతా రంగాలతో పోలిస్తే వేతనాలతోపాటు ‘ఐటీ’లో ఉద్యోగుల వలసలు అధికమే. కానీ, ఆ రంగ కంపెనీలకిది ప్రధాన సమస్యగా మారింది. 

ప్రతిభావంతులు చేజారకుండా రక్షించుకునేందుకు ఈ కంపెనీలు అదనపు నైపుణ్యాల శిక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్‌ అవసరాలకు వారిని సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి.

అమెరికన్‌ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ గత మూడేళ్లలో భారత కార్యాలయాల్లో పనిచేస్తున్న 85 శాతం ఉద్యోగులకు డిజిటల్‌, క్లౌడ్‌, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబిలిటీ, డిజైన్‌ థింకింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, గేమిషికేషన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్ వంటి ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణనిస్తోంది. 

ఆటోమేషన్‌, ఏఐ టెక్నాలజీ ద్వారా ఆదా చేసిన మొత్తాన్ని యాక్సెంచర్‌ తన ఉద్యోగుల నైపుణ్య శిక్షణ కోసం మళ్లిస్తోంది. తన ఉద్యోగులను భవిష్యత్‌ డిమాండ్లకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఇన్ఫోసిస్‌ 75 కొత్త కోర్సులను రూపొందించింది. 

మరో ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ సైతం తన ఉద్యోగులకు కొత్త టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చేందుకు టెక్నాలజీ కౌన్సిల్‌, ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌లను ఏర్పాటు చేసుకుంది. టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌, టెక్‌మహీంద్రా కూడా ఉద్యోగులకు పునఃశిక్షణకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
ఎందుకంటే, కొత్త ఉద్యోగుల నియామకానికయ్యే ఖర్చు, వెచ్చించాల్సిన సమయంతో పోలిస్తే ఉన్న ఉద్యోగులకే తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణనివ్వడం మేలని కంపెనీలు భావిస్తున్నాయి.వచ్చే ఐదేళ్లలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో దాదాపు 40 శాతం మందికి ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సి వస్తుందని నాస్కామ్‌ పేర్కొంది. 

బిగ్‌ డేటా అనలిటిక్స్‌, ఏఐ, ఎంఎల్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ వంటి వర్ధమాన టెక్నాలజీలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. కొత్త టెక్నాలజీలతో 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకు రానున్నాయని ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) గత వార్షిక సమావేశంలో విడుదల చేసిన ఓ రిపోర్టు అంచనా వేసింది. 

2030కల్లా 40-80 కోట్ల ఉద్యోగాలను యాంత్రీకరించే అవకాశం ఉందని మెకిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయన నివేదిక అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులకు ఎప్పటికప్పుడు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారానే వ్యాపారాలు పురోగతి సాధించగలవని మెకిన్సే రిపోర్టు అభిప్రాయపడింది.
 
ఆన్‌ బెంచ్‌పై ఉన్న వారిని సైతం పూర్తి స్థాయిలో ఉయోగించుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు భారీ సైజు కాంట్రాక్టులను, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టాయి. 

టీసీఎస్‌ అయితే యువ నిపుణులను ఏక కాలంలో పలు ప్రాజెక్టుల్లో పని చేయిస్తోంది. తద్వారా వారికి పలు సాంకేతికల్లో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుందని టీసీఎస్‌ నిపుణుల విభాగ గ్లోబల్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ అన్నారు.
 
మహీంద్రా లాజిస్టిక్స్‌తో టెక్‌ మహీంద్రా జట్టుకట్టింది. తన ఉద్యోగుల రవాణా నిమిత్తం ఎలక్ర్టిక్‌ వాహనాలను వినియోగించడం దీని ఉద్దేశం. ఈ మేరకు టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌ క్యాంపస్‌లోని ఉద్యోగుల ప్రయాణం కోసం మహీంద్రా ఈ-వెరిటో వెహికిల్స్‌ను మహీంద్రా లాజిస్టిక్స్‌ అందుబాటులోకి తెచ్చింది. 

ఎలక్ర్టిక్‌ మొబిలిటీకి టెక్‌ మహీంద్రా కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా మహీంద్రా లాజిస్టిక్స్‌తో చేతులు కలిపినట్టు కంపెనీ ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. రానున్న కాలంలో తమ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మరిన్ని ఎలక్ర్టిక్‌ వాహనాలను వినియోగిస్తామన్నారు.
 
హైదరాబాద్‌లో విప్రో లాబ్‌
హైదరాబాద్‌లో విప్రో తన గ్లోబల్‌ డిజిటల్‌ ప్రొడక్ట్‌ కాంప్లియెన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు. ఈ లాబ్‌ 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ప్రొడక్ట్‌ టెస్టింగ్‌ సర్వీసులు అందిస్తుంది. ఆటోమోటివ్‌, రక్షణ, కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌, ఏరోస్పేస్‌, టెలీకామ్‌, మెడికల్‌, ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల కస్టమర్లకు అందించే ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా
ఈ ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతాయి.