Asianet News TeluguAsianet News Telugu

భేష్ ఇన్ఫీ.. టీసీఎస్‌పై పైచేయి: అంచనాల కందని లాభాలు.. ఇన్వెస్టర్లకు మెరుపులు

సుదీర్ఘ కాలం తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)పై ఇన్ఫోసిస్ పై చేయి సాధించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫలితాల్లో నికర లాభాల్లో అంచనాలను మించింది. ఈ ఏడాది ఫ్రెషర్లతోపాటు క్యాంపస్ సెలక్షన్ల ద్వారా 18 వేల మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇన్వెస్టర్లకు డివిడెండ్లు, బైబ్యాక్ రూపంలో అధిక నగదు ఇవ్వాలని నిర్ణయించింది. 

Infosys pulls ahead of TCS after long time
Author
Bengaluru, First Published Jul 13, 2019, 12:30 PM IST

బెంగళూరు: జూన్‌ నెలతో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో కొంత నొప్పించినా ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లను మెప్పించింది. నికర లాభంలో మాత్రం అంచనాలను మించి రాణించింది. బ్రోకరేజీ సంస్థలకు అనుగుణంగానే మార్జిన్లలో క్షీణత నమోదైంది.

సంస్థ ఆదాయం విషయంలోనూ వాటి అంచనాలకు అనుగుణంగానే ఇన్ఫోసిస్ గణాంకాలను ప్రకటించింది. మరో వైపు ఆదాయ అంచనాలను పెంచడంతో పాటు వచ్చే అయిదేళ్లలో డివిడెండ్లు, బైబ్యాక్‌ రూపంలో వాటాదార్లకు అధిక నగదును ఇవ్వాలని నిర్ణయించడం మెప్పించే నిర్ణయం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 5.2 శాతం వృద్ధితో రూ.3,802 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.3,612 కోట్లుగా నమోదైంది.

కాగా మార్కెట్ విశ్లేషకులు సంస్థ నికర లాభం కేవలం 2% వృద్ధితో రూ.3,680 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఆ అంచనాలను మించి గణాంకాలు వెల్లడయ్యాయి. అమెరికా డాలర్లలో నికర లాభం అంతక్రితం ఏడాది ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే 534 మిలియన్‌ డాలర్ల నుంచి 546 మిలియన్ల డాలర్లకు పెరిగింది. 

2019 జూన్‌ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 13.9 శాతం వృద్ధితో రూ.21,803 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ ఆదాయాలు 14% వృద్ధితో రూ.21883 కోట్లకు చేరుతాయన్న బ్రోకరేజీ సంస్థల సగటు అంచనాకు ఇవి చేరువలోనే ఉండడం గమనార్హం.

ఇక డాలర్లలో ఇన్ఫోసిస్ ఆదాయం 2.83 బిలియన్ల నుంచి 3.13 బిలియన్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను 8.5-10 శాతానికి పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్‌ త్రైమాసికంలో ఈ అంచనాలను 7.5-9.5 శాతంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే జూన్ త్రైమాసికంలో ఆపరేటింగ్‌ మార్జిన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 20.5 శాతానికి ఆపరేటింగ్ మార్జిన్లు పరిమితమయ్యాయి. మార్చి త్రైమాసికంలో నమోదైన 23.7 శాతం,  అంతక్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో నమోదైన 21.4 శాతం కంటే ఇది తక్కువ.

కాగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ అంచనా అయిన 21-23 శాతానికి చేరగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. కాగా అమెరికాకు చెందిన ట్రైఫాక్టా ఇంక్‌లో అదనంగా 6 మిలియన్ల డాలర్ల (రూ.41 కోట్లకు పైగా) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2016లో ఈ కంపెనీలో 4 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను  పెట్టింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్ల ద్వారా 18,000 మందిని చేర్చుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 8,000 మందిని నియమించుకున్నామని తెలిపింది. అందులో 2,500 మంది ఫ్రెషర్లు. 

మొత్తం ఏడాదికి క్యాంపస్‌ నియామకాల ద్వారా 18,000 మందిని తీసుకుంటామని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) యూబీ ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. త్రైమాసికంలో నికరంగా 906 మంది ఉద్యోగులను జత చేసుకోవడంతో జూన్‌ 2019 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,29,029కి చేరింది. 

కంపెనీ ప్రస్తుత విధానం ప్రకారం.. తన వద్ద నగదులో 70 శాతం వరకు డివిడెండు, బైబ్యాక్‌లకు ఉపయోగించాలి. అయితే 2019-20 నుంచి అయిదేళ్ల పాటు పాక్షిక వార్షిక డివిడెండ్లు, బైబ్యాక్‌లు, ప్రత్యేక డివిడెండ్ల కోసం 85 శాతం వరకు(అయిదేళ్ల సమ్మిళితం లెక్కన) నగదును ఖర్చు చేయనుంది. 

అంటే మదుపర్లకు కంపెనీ నుంచి వచ్చే నగదు పరిమాణం పెరగనుందన్నమాట. ఆ మేరకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు ఉంది.

త్రైమాసిక ఫలితాలపై ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరీఖ్ స్పందిస్తూ.. ‘2019-20 ఏడాదిని బలంగా మొదలుపెట్టాం. స్థిర కరెన్సీ వృద్ధి 12.4 శాతానికి చేరడం, డిజిటల్‌ ఆదాయాల వృద్ధి 41.9 శాతంగా నమోదవడం ఇందుకు సహకరించింది. మా క్లయింట్లు, పెట్టుబడులపై స్థిరంగా మా దృష్టిని కొనసాగించడం వల్ల ఇది సాధ్యమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై ఉన్న ధీమాతో మా ఆదాయ అంచనాలను 7.5-9.5% నుంచి 8.5-10 శాతానికి పెంచుతున్నాం’ అని తెలిపారు.

తొలి త్రైమాసికంలో డాలర్ల రూపంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 534 మిలియన్‌ డాలర్ల నుంచి 546 మిలియన్‌ డాలర్లకు పెరిగి 2.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూపేణా 12.4 శాతం వృద్ధి సాధించింది.

జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 2.7 బిలియన్‌ డాలర్ల విలువైన భారీస్థాయి కాంట్రాక్టులను ఇన్ఫీ దక్కించుకుంది. 100 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో రెండు కాంట్రాక్టులు, 10 మిలియన్‌ డాలర్లకు మించిన విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి. కంపెనీకి డిజిటల్‌ విభాగం నుంచి 1,119 మిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 41.9 శాతం ఎగసింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 35.7 శాతానికి చేరింది.

ఇంధనం–యుటిలిటీస్‌ విభాగం ఆదాయం 4.7 శాతం(సీక్వెన్షియల్‌), కమ్యూనికేషన్‌ 4.6 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ప్రాంతాలవారీగా ఉత్తర అమెరికా నుంచి ఆదాయం సీక్వెన్షియల్‌గా 3 శాతం వృద్ధి చెందింది. మిగత దేశాల నుంచి ఆదాయంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios