వాషింగ్టన్: అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ పౌండర్, సీఈవో, జెఫ్ బెజోస్‌(54) వ్యక్తిగతంగా సమస్యల్లో చిక్కుకున్నారు. దీనికి సోషల్‌ మీడియా ద్వారా బుధవారం ఆయన చేసిన సంచలన  ప్రకటనే నిదర్శనం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మెక్కెంజేతో విడాకులు తీసుకున్నట్టు షాకింగ్ ‘ట్వీట్’ చేశారు.

తమ జీవితాల్లో చోటుచేసుకున్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని హితులు, సన్నిహితుల దృష్టికి తీసుకొస్తున్నామని జెఫ్ బెజోస్ ట్వీట్‌ చేశారు. పాతికేళ్లే భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామని పేర్కొన్నారు. తాము విడాకులు తీసుకున్నా స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడివెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని జెఫ్ బెజోస్, మెక్కెంజె సంయుక్త ప్రకనటలో తెలిపారు.

మెక్కెంజీ (48) మంచి రచయిత్రి కూడా.. న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో మెక్కెంజీ, జెఫ్ బెజోస్ తొలిసారి కలుసుకున్నారు. ఇలా వీరి మధ్య చిగురించిన ప్రేమ అదే ఏడాది ఆరునెలల తరువాత వివాహ బంధంగా మారింది. 

వీరికి నలుగురు పిల్లలు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే  తన రచనలకు, మొదటి బెస్ట్‌ రీడర్‌ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతోపాటు  మెకంజీ  బైస్టాండర్‌ రివల్యూషన్‌  (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు.

1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్‌ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సార్లు జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు కూడా.

కేవలం రెండు రోజుల క్రితమే అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అమెజాన్‌ భారీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో మైక్రోసాఫ్ట్‌ను వెనక్కినెట్టి అగ్రశ్రేణి సంస్థగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రశ్నల్ని సశేషంగా మిగిల్చిన ఈ హఠాత్పరిణామం అమెజాన్‌​ వాటాదారుల్లో తీవ్ర అందోళన రేపింది. అమెజాన్ యాజమాన్య మార్పునకు తీస్తుందా అనే సందేహాలు పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.