Asianet News TeluguAsianet News Telugu

పోటీ యాప్స్‌కు అడ్డుగోడలా‘సెర్చింజన్’.. దర్యాప్తునకు సీసీఐ ఆదేశం

ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’ ఆధిపత్య ధోరణి, కాంపిటీషన్ నిబంధనల విరుద్ధ వైఖరిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి ఫిర్యాదులు వచ్చాయి. పోటీ యాప్స్ అభివ్రుద్ధి, వినియోగానికి అడ్డుకట్ట వేస్తున్నదని, స్మార్ట్ ఫోన్ సంస్థలకు ప్రీ కండీషన్లు పెడుతున్నదని అభియోగాలు వచ్చాయి. దీనిపై సీసీఐ ప్రాథమిక దర్యాప్తులో నిజమేనని తేలింది. దీంతో లోతుగా దర్యాప్తునకు సీసీఐ ఆదేశించింది. కానీ తమ తప్పేమీ లేదని గూగుల్ దాటవేసింది. 

Google's conduct may result in denial of market access for competing apps: CCI
Author
New Delhi, First Published Jul 2, 2019, 1:37 PM IST

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’ యాప్స్, మెయిల్స్ తదితర విభాగాల్లో పట్టు సంపాదించింది. ఆధిపత్య స్థానంలో ఉండటంతో ఇతర యాప్స్ సంస్థలు భారత మార్కెట్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకోవడంతోపాటు పెత్తనం చేస్తున్నదన్న విమర్శలు వచ్చాయి.


దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా ప్రాథమిక దర్యాప్తు చేసింది. పోటీగా వచ్చిన యాప్స్‌కు మార్కెట్‌లో అవకాశాలు లేకుండా చేసి భారత విపణిలో తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునే విధానాలను గూగుల్‌ అనుసరిస్తున్నదని సీసీఐ ప్రాథమిక విచారణలో తేలింది. 

 

ఉదాహరణకు మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (మాడా) కింద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తప్పనిసరి (mandatory)గా తమ జీఎంఎస్ (గూగుల్ మొబైల్ సర్వీసెస్)ను ప్రీ ఇన్‌స్టలేషన్ చేసుకోవాలని గూగుల్ షరతు విధిస్తోంది. ఇది కాంపిటీషన్ నార్మ్స్‌కు వ్యతిరేకమేనని సీసీఐ నిర్ధారణకు వచ్చింది. యాప్స్ ప్లే స్టోర్స్‌లో గూగుల్ సంస్థదే ఆధిపత్యం. 

 

దీంతో భారత్‌లో గూగుల్‌ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై లోతుగా దర్యాప్తు చేసిన 150 రోజుల్లోగా గడువులోగా నివేదిక ఇవ్వాలని తన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)ను కోరింది. భారత్‌లో విక్రయించే లేదా తయారు చేసే స్మార్ట్‌ఫోన్లలో ముందుగానే తమ యాప్స్‌, సర్వీసులు ఇన్‌స్టాల్‌ చేయాలని గూగుల్‌ షరతులు పెడుతోంది.

 

ఇదే సమయంలో ఈ ఫోన్ల తయారీదారులు కొత్త యాప్స్‌ను అభివృద్ధి చేయడం గానీ, మెరుగులు దిద్దడం గానీ చేయకుండా అడ్డుకోవడంతోపాటు తన యాప్స్‌కు పోటీ యాప్స్‌ ఇన్‌స్టలేషన్ చేయడాన్నీ అడ్డుకుంటోందని సీసీఐకి ఫిర్యాదులు అందాయి. దీంతో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. పోటీ యాప్స్ ఇన్‌స్టలేషన్‌ను అడ్డుకోవడానికి కారణమైన వారి పాత్ర, బాధ్యతపైనా సీసీఐ దర్యాప్తు కొనసాగుతుంది. 

 

గూగుల్‌ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి వేసింది. స్మార్ట్‌ఫోన్లలో తమ యాప్స్‌, సర్వీసెస్‌ ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉన్నా వినియోగదారులు వాటిని ఎప్పుడైనా తొలగించి వేరే యాప్స్‌, సర్వీసెస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయంలో తమ పాత్ర పరిమితమని స్పష్టం చేసింది. 

 

ఆండ్రాయిడ్ యూజర్లకు తమ ఫోన్లలో యాప్స్ ఇన్ స్టల్ చేసుకునే స్వేచ్ఛ ఉన్నదని వ్యాఖ్యానించింది. తమ యాప్స్‌తోపాటు పోటీయాప్స్ ఇన్ స్టలేషన్ లేదా తొలగింపు స్వేచ్ఛ స్మార్ట్ ఫోన్ల కస్టమర్లకు ఉన్నదని గూగుల్ తెలిపింది. గూగుల్ సంస్థపై వచ్చిన ఆరోపుణలపై సీసీఐ గత ఏప్రిల్ 16న దర్యాప్తునకు ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios