సెర్చింజన్ వేటు: ప్లే స్టోర్ నుంచి ఫ్రాడ్ 600 యాప్‌ల తొలగింపు
తమ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో దాదాపు 600 యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేశామని సెర్చింజిన్ ‘గూగుల్’ వెల్లడించింది.
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై సెర్చింజన్ గూగుల్ మరోసారి వేటు వేసింది. మొబైల్ ప్రకటన మోసాలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా గూగుల్ తన గూగుల్ ప్లే స్టోర్ నుండి వందల యాప్‌లకు చెక్ పెట్టింది. ఈ మేరకు గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తమ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో దాదాపు 600 యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేశామని సెర్చింజిన్ ‘గూగుల్’ వెల్లడించింది. తమ ప్రకటనల మోనిటైజేషన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ యాడ్‌మాబ్, గూగుల్ యాడ్ మేనేజర్ నుండి నిషేధించామని ప్రకటించింది.
Also read:బీఎస్-6 ప్రమాణాలతో విపణిలోకి హోండా షైన్’ బైక్.. రూ.67,857
భంగపరిచే ప్రకటనల తీరును తాము అనుమతించమని కంపెనీ గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో యాడ్ ట్రాఫిక్ క్వాలిటీ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ పెర్ బిజోర్కే తెలిపారు. విఘాతకరమైన ప్రకటనలతో సహా, అనవసర ట్రాఫిక్‌ను సృష్టిస్తున్న యాప్‌లను నిరోధించడంతోపాటు, వినియోగ దారులు, ప్రకటనదారులకు భరోసా కల్పించేలా తమ ప్లాట్‌ఫాంపై తగిన విధానాలను అభివృద్ధికి, రూపకల్పనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెడుతూనే ఉంటామన్నారు.
యూజర్ బ్రౌజర్‌లో ఊహించని రీతిలో ఈ ప్రకటనలు పాప్ అప్ అవుతూ అంతరాయం కలిగిస్తున్నాయని గూగుల్ తెలిపింది. వాస్తవానికి వినియోగదారుడు యాప్‌లో చురుగ్గా లేనప్పుడు కూడా ఒక విధమైన విఘాతకర ప్రకటనలను హానికర డెవలపర్లు మొబైల్స్‌లో అందిస్తున్నారని గూగుల్ ఆరోపించింది.
తొలగించిన యాప్‌లు 4.5 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్ అయినట్టు తెలిపింది. ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లు ఉన్నట్టు తెలిపింది. ఈ యాప్‌ల డెవలపర్లు ప్రధానంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, భారతదేశంలో ఉన్నారని వివరించింది. అయితే తొలగించిన అప్లికేషన్ల వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు.