పారిస్‌: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ గణించడానికి 10,000 ఏళ్ల సమయం పట్టే ఒక గణనను తమ క్వాంటమ్‌ సిస్టమ్‌ సికామోర్‌ కేవలం 200 సెకండ్లలో గణించినట్లు గూగుల్‌ నిపుణుల బృందం తెలిపింది. 

తాజాగా జరిగిన ఈ ఆవిష్కరణను గూగుల్ ‘క్వాంటమ్ సుప్రిమసీ’ అని అభివర్ణించింది. సాధారణ కంప్యూటర్లు (వేగవంతమైనవి కూడా) బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియ నిర్వహిస్తాయి. డేటాను చిన్న బిట్లుగా విభజించి టాస్క్‌ను పూర్తిచేస్తాయి. 

also read బీఎస్ఎన్ఎల్... ఉద్యోగులకు మంచి రోజులు...

ఈ బిట్లు కేవలం ‘0’ లేదా ‘1’గా మాత్రమే ఉంటాయి. అయితే క్వాంటమ్‌ కంప్యూటర్‌లో డేటా క్యూబిట్స్‌గా (ఒకేసారి ‘1’, ‘0’గా) విడి పోతుంది. క్యూబిట్స్‌కు ఉన్న ‘ద్వంద్వ స్థితి’ స్వభావం వల్లే పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్‌ చేసేందుకు వీలవుతుంది. 

గూగుల్‌ బృందం 54 క్యూబిట్లతో సికామోర్‌ క్వాంటమ్‌ ప్రాసెసర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసింది. ఈ చిప్‌లో ప్రతి క్యూబిట్ మరో నాలుగు క్యూబిట్లతో అనుసంధానమై ఉంటుంది. అందువల్లే గణన ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుందని గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) శాస్త్రవేత్త జాన్ మార్టిన్స్ చెప్పారు. 

కేవలం కొన్ని మిల్లీ మీటర్ల సైజులో ఉన్న సికామోర్‌.. సాధారణ మెషీన్‌ గణించేందుకు 10 వేల ఏళ్లు పట్టే గణనను 200 సెకన్లలోనే పూర్తిచేసినట్లు గూగుల్‌ తెలిపింది. ఇది అసాధారణ విజయమని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విలియమ్‌ ఓలివర్‌ అభివర్ణించారు. ఇది 20వ శతాబ్ది ప్రారంభంలో రైట్‌ సోదరులు విమానాన్ని రూపొందించడంతో సమానమని అని పేర్కొన్నారు.

తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బృందం సాధించిన ఘనత పట్ల గర్వంగా ఉందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. ఇదొక భారీ ముందడుగు అని అభివర్ణించారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వాస్తవ రూపం దాల్చడంలో ఇది గొప్ప మైలురాయి అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. దశాబ్దానికి పైగా జరిపిన క్రుషితో ‘క్వాంటమ్ సుప్రిమసీ’ సాధ్యమైందన్నారు. దీన్ని సుసాధ్యం చేసే పరిశోధనల్లో పాల్గొన్న వారందరికీ సుందర్ పిచాయ్ ధన్యవాదాలు తెలిపారు. 

also read స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త...తెలిస్తే షాక్ అవుతారు

గూగుల్‌ ప్రకటనపై ఐబీఎం అనుమానాలు వ్యక్తం చేసింది. సికామోర్‌ ఘనతను గూగుల్‌ ఎక్కువ చేసి చూపుతున్నదని పేర్కొంది. సికామోర్‌ చేసిన గణనను సాధారణ కంప్యూటర్‌ 10 వేల ఏండ్లకు బదులుగా కేవలం రెండున్నర ఏండ్లలో చేయగలదని తెలిపింది. వాస్తవంగా గూగుల్ ‘క్వాంటమ్ సుప్రీమసీ’కి సంబంధించిన కొన్ని వివరాలు గత నెలలోనే బయటకు వచ్చాయని పేర్కొంది. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విస్త్రుత పరిశోధనలు జరుపుతున్నది ఐబీఎం.