బీఎస్ఎన్ఎల్... ఉద్యోగులకు మంచి రోజులు...
బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ అన్నట్లే ఆ సంస్థకు, అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. ఎంటీఎన్ఎల్ సంస్థను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం కానున్నది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. రెండు సంస్థలపై సంస్థాగత భారాన్ని తగ్గించేందుకు యాబైమూడున్నరేళ్ల వయస్సు దాటిన ఉద్యోగులు, అధికారులకు ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది కేంద్రం. అంతే కాదు 2016 ధరలకే 4జీ స్పెక్ట్రం కేటాయించనున్నది. అందుకూ నిధులను కేటాయించింది. ఇక ఆ సంస్థలు చేయాల్సిందల్లా ఇతర ప్రొవైడర్లతో పోటీ పడి దూసుకెళ్లాల్సిందే.
న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కోలుకోనున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)ల పునరుద్ధరణలో భాగంగా విలీనానికి బుధవారం కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఎంటీఎన్‌ఎల్ కలిసి పోనున్నది.
రెండు సంస్థల పునరుద్ధరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సేవల్లో నాణ్యత పెంచుకోగలిగితే బీఎస్ఎన్ఎల్ సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొబైల్స్‌లో 4జీ సేవలు పాతబడి 5జీ కోసం అడుగులు పడుతున్న వేళ ఇప్పటికీ 4జీ స్పెక్ట్రం కోసం బీఎస్ఎన్ఎల్ ఎదురుచూసే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది.
1990వ దశకంలోనే 2జీ సేవలు ప్రారంభమైనా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 2000 వరకు కేంద్రం అనుమతించలేదు. బీఎస్ఎన్ఎల్ రంగంలోకి దిగే వరకు మొబైల్ వినియోగదారులు ఇన్ కమింగ్ చార్జీలు కూడా నిమిషానికి రూ.8 వరకు చెల్లించాల్సి వచ్చేది. 3జీ సేవల్లోనూ అంతే.
also read 10 వేల ఏళ్లలో తేల్చాల్సిన లెక్క 200సెకన్లలోనే...గూగుల్ విజయం
తాజాగా 2016లో జియోతో దూసుకొచ్చిన రిలయన్స్.. ఏడాదిలోపే 10 కోట్ల మందికి పైగా చందాదారులను కూడగట్టుకోగలిగింది. ఇతర సంస్థలు 4జీ సేవలను విస్తరిస్తున్నా.. బీఎస్ఎన్ఎల్ కు మాత్రం కేంద్రం అనుమతులు ఇవ్వలేదు.
ప్రైవేట్ టెలికం సంస్థలు రూ. లక్షల కోట్ల అప్పుల్లో ఉండగా, బీఎస్ఎన్ఎల్ రుణభారం రూ.14 వేల కోట్లే. పెద్ద వయస్సు గల వారు వీఆర్ఎస్ తీసుకుంటే మెరుగైన సేవలందించడం ద్వారా బీఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం సాధించడం సాధ్యమేనని చెబుతున్నారు.
అయితే, సిబ్బందికి వేతనాల చెల్లింపు మూడు సార్లు ఆలస్యమవ్వడంతో బీఎస్ఎన్ఎల్ మూత పడుతుందన్న విమర్శలు వినవచ్చాయి. తొలిసారి ఫిబ్రవరిలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. ఇదిలా ఉంటే రెండు సంస్థల విలీనంతోపాటు సిబ్బందికి ఆకర్షణీయమైన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు కోసం కేంద్రం ముందుకు వచ్చింది.
విలీనం ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎంటీఎన్ఎల్.. బీఎస్‌ఎన్‌ఎల్ అనుబంధ సంస్థగా కొనసాగనున్నదని కేంద్ర క్యాబినెట్ తర్వాత టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ రెండు సంస్థలను కాపాడేందుకు తమ ప్రభుత్వం రూ.69 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని తెస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
ఎంటీఎన్‌ఎల్ దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతుండగా, లండన్ స్టాక్ ఎక్సేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌ల్లోనూ డిపాజిటరీ రిసిప్ట్స్‌లో ఉన్నది. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం లిస్టింగ్ కాలేదు. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ఆఖరు నాటికి దేశీయ మొబైల్ సర్వీసుల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 89.78 శాతంగా ఉన్నది.
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ 10.22 శాతానికే పరిమితం అయ్యాయి. ఆగస్టులో బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు 2.15 లక్షలు, ఎంటీఎన్‌ఎల్ కస్టమర్లు 6,701 మంది ఇతర నెట్‌వర్క్‌ల్లోకి మారిపోయారు.
మరోవైపు కేంద్రం నిర్ణయం నేపథ్యంలో వచ్చే 12-15 నెలల్లో దేశవ్యాప్తంగా 4జీ సేవల కోసం సుమారు రూ.7,200 కోట్లతో 60 వేల మొబైల్ సైట్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. రెండేళ్లలో తిరిగి లాభాల్లోకి రాగలమని ఎంటీఎన్‌ఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇరు సంస్థల రుణ భారం రూ.40 వేల కోట్లు.
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగంచెల ప్రక్రియను ప్రకటించింది. ఇందులో సావరిన్ బాండ్ల (ప్రభుత్వ బాండ్లు) జారీ ద్వారా నిధుల సమీకరణ, ఆస్తుల అమ్మకం, ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ (వీఆర్‌ఎస్), 4జీ స్పెక్ట్రం కేటాయింపులున్నాయి.
సావరిన్ బాండ్ల విలువ రూ.15 వేల కోట్లు. ఇరు సంస్థల తక్షణ మూలధన అవసరాలకు ఇది పనికి వస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇక వచ్చే మూడేళ్లకు పైగా కాలంలో ఈ సంస్థలకు చెందిన రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులనూ అమ్మేయనున్నట్లు తెలిపారు.
వ్యాపారం అంతంతమాత్రంగా ఉన్న వేళ ఉద్యోగుల జీతభత్యాలు భారంగా భావించిన కేంద్రం.. సంస్థాగత వ్యయ భారం తగ్గింపుకనకు ఆకర్షణీయ వీఆర్‌ఎస్‌ను తెచ్చింది. 50 నుంచి 53 1/2 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగులెవరైనా వీఆర్‌ఎస్ తీసుకోవచ్చు.
వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు నష్టపరిహారంగా 125 శాతం వేతనం, పెన్షన్‌ను పొందుతారని, 60 ఏండ్ల వరకు గ్రాట్యుటీని అందుకుంటారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.29,928 కోట్లను కేంద్రం కేటాయించింది. సకాలంలో నెలసరి జీతాలనూ ఇవ్వలేని దుస్థితిలో ఈ సంస్థలున్న సంగతీ విదితమే.
ప్రతీ నెల బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల జీతాలు రూ.850 కోట్లుగా ఉన్నాయి. సంస్థలో 1.68 లక్షల మంది పని చేస్తుండగా, గత ఆర్థిక సంవత్సరం (2018-19) రూ.14 వేల కోట్ల నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో ఉద్యోగుల వేతనాల విలువ 75 శాతం. ఎంటీఎన్‌ఎల్‌లో ఇది 87 శాతం.
బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.20,140 కోట్ల విలువైన 4జీ స్పెక్ట్రంను కేటాయిస్తామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. జీఎస్టీ కోసం మరో రూ.3,674 కోట్లనూ ప్రకటించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.14,115 కోట్ల స్పెక్ట్రం, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.6,295 కోట్ల స్పెక్ట్రం దక్కనున్నది. 2016 నాటి ధరల ప్రకారమే ఈ కేటాయింపులు ఉంటాయన్నారు.
దశల వారీగా 4జీ సేవల విస్తరణ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాదాపు రూ.10 వేల కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌కు సుమారు రూ.1,100 కోట్లు అవసరం కానున్నాయి. ఎంటీఎన్‌ఎల్ సేవలు పరిమితమైనా.. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ నుంచి ఏపీ, బీహార్, జార్ఖండ్ సర్కిళ్లలో మాత్రమే 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో పోటీని తట్టుకోలేకపోతున్నామని 4జీ స్పెక్ట్రం కేటాయించాలని బీఎస్‌ఎన్‌ఎల్.. కేంద్రానికి మొరపెట్టుకుంటూనే ఉన్నది. తాజాగా ఈ అభ్యర్థనకు ప్రభుత్వం అంగీకరించింది.
2000 అక్టోబర్ ఒకటో తేదీన స్థాపించ బడిన బీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 2018-19 నాటికి రూ.19,308 కోట్లుగా ఉంది. 2016 నాటికి ఆస్తుల విలువ రూ.70,746.75 కోట్లు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1.68 లక్షల మంది.
also read గూగుల్, జిమెయిల్.... ఇక ఒక్కటే ప్రొఫైల్ ఫోటో
బీఎస్ఎన్ఎల్ ఢిల్లీ, ముంబై మినహా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్, బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ టెలివిజన్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సేవలను అందిస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సుమారు 12 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్), ముంబై, నవీ ముంబై, థానే, మారిషస్, నేపాల్ దేశాల్లో సేవలందిస్తోంది ఎంటీఎన్ఎల్. 1986 ఏప్రిల్ ఒకటో తేదీన స్థాపించబడింది. ప్రభుత్వ వాటా 57 శాతం గల ఈ సంస్థకు 2017-18 నాటికి ఆదాయం రూ.3,116.42 కోట్లు.
ఎంటీఎన్ఎల్ 2017-18 నాటికి ఆస్తులు రూ.16,249.66 కోట్లు కాగా, దాదాపు 22,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ మాదిరిగానే డిజిటల్ టెలివిజన్‌తోపాటు అన్ని సేవలందిస్తున్న ఎంటీఎన్ఎల్ సంస్థకు ఈ ఏడాది జనవరి నాటికి 67 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.