వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం కం సెర్చింజన్ గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ, స్మార్ట్‌వాచ్‌  తయారీ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 

ఆరోగ్యవంత జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఫిట్‌బిట్‌ కో ఫౌండర్ కమ్ సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు. అత్యుత్తమ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఫిట్‌నెస్ బ్యాండ్లు, తదితర వేరబుల్ ఉత్పత్తుల మరింత మెరుగుదలకు ఈ పార్టనర్‌షిప్ తోడ్పడగలదని గూగుల్ డివైజెస్‌, సర్వీసెస్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రిక్ ఓస్టర్‌లో తెలిపారు.

వేరబుల్స్ విభాగంలోకి అందరికన్నా ముందుగా ప్రవేశించినా ఇతర సంస్థలతో పోటీ వల్ల వెనుకబడుతున్న ఫిట్‌బిట్‌కు ఈ డీల్ ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు, ఆన్‌లైన్‌ సెర్చిలో గుత్తాధిపత్యం ఆరోపణలు ఎదుర్కొంటుండంతో.. ఇతరత్రా హార్డ్‌వేర్‌ ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్న గూగుల్‌కు కూడా ఇది ఉపయోగపడనుంది. 

తద్వారా  ప్రత్యర్థి సంస్థ యాపిల్‌కు పోటీగా వేరబుల్‌ టెక్నాలజీ విభాగంలో గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఫిట్‌నెస్‌ వేరబుల్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన తొలి సంస్థల్లో ఒకటైన ఫిట్‌బిట్‌, తర్వాత కాలంలో పోటీలో నిలబడలేకపోయింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి, ఫిట్‌నెస్‌ వేరబుల్స్‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. షియోమీ, ఆపిల్‌, హువావే తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ప్రత్యర్థులతో ఫిట్‌బిట్‌ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుండగా.. ఇంటర్నెట్‌ నుంచి హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల్లోకి మరింతగా విస్తరించాలని గూగుల్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ఇరు సంస్థలకు మేలు చేసేదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

తమ ఉత్పత్తుల్ని 2.8 కోట్ల మంది వాడుతున్నారని, గూగుల్‌ వల్ల ఇకపై తమ టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఫిట్‌బిట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు గూగుల్‌ సైతం.. అద్భుతమైన హార్ట్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, కృత్రిమ మేధను ఒకచోట చేర్చి మరింత మందికి చేరేలా చేస్తామని ధీమా వ్యక్తం చేసింది.