న్యూఢిల్లీ: ఇటీవల ఆన్‌లైన్‌లో శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ కోసం బుక్ చేస్తే రెడ్ మీ బాక్స్‌లో ఇటుకలు, రాళ్లు.. చొక్కా ప్యాంట్ల కోసం ఆర్డర్ చేస్తే చీరలు పంపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి కూడా భారీగానే ఈ-కామర్స్ సంస్థలపై భారీగానే ఫిర్యాదులు అందుతున్నాయని తేలింది.

ప్రతి ఐదు దర్యాప్తుల్లో ఒకటి ఈ-కామర్స్ సంస్థలపైనని.. అందునా అత్యధిక ఫిర్యాదులు రిటైల్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ పైనేనని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. తర్వాతీ జాబితాలో రిలయన్స్ జియో, మరో రిటైల్ ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉన్నాయని ఆ కథనం వివరించింది.

కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్ప్‌లైన్‌కు ఈ-కామర్స్ సంస్థలపై కాకుండా టెలికం, బ్యాంకింగ్ రంగ సంస్థలపై కూడా అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయని ఓ అధికారి తెలిపారు. ఈ-కామర్స్ రంగ వినియోగదారుల సంఖ్య గణనీయంగానే పెరుగుతుండటంతో అదే స్థాయిలో ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని ఈ కథనం పేర్కొన్నది.

గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిర్యాదుల సంఖ్య 40-50 శాతం పెరిగే అవకాశం ఉన్నదని నేషనల్ హెల్ప్ లైన్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాగా, లక్షకు పైగా ఈ-కామర్స్ సంస్థలపై వచ్చినవే. బ్యాంకులపై 41,600, టెలికం సంస్థలపై 29,400 ఫిర్యాదులు వచ్చాయి. గతేడాది కూడా వచ్చిన 5.65 లక్షల ఫిర్యాదుల్లో లక్ష వరకు ఈ-కామర్స్ సంస్థలపై వచ్చినవే ఉన్నాయి.

తమకు పాడైన వస్తువులు పంపారని, మార్పిడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆర్డర్ చేసిన వస్తువును ఆలస్యంగా పంపారని ఈ కామర్స్ సంస్థలపై ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. అధిక బిల్లు వేయడంతోపాటు డేటా తగ్గించారని, కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయంటూ టెలికం సంస్థల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

దీనిపై ఫ్లిప్ కార్ట్ స్పందిస్తూ వినియోగదారుల సహకారానికి, వారికి ఎదురయ్యే సమస్యల సత్వర పరిష్కారానికి ఎప్పటికప్పుడు తమ విధానాలను మెరుగు పర్చుకుంటున్నామని తెలిపింది. ఈ-కామర్స్ లావాదేవీలపై అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నాణ్యతపై రాజీ పడటం లేదని పేర్కొంది.

అమెజాన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ‘కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వ వినియోగ హెల్ప్ లైన్‌తో కలిపి కంపెనీ పని చేస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా వస్తున్న ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. రిలయన్స్ జియో స్పందించలేదు.