వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో వైట్ హౌస్‌లో అన్ని మాధ్యమాల ప్రతినిధులతో ఓ సదస్సు నిర్వహించనున్నారు. ఇంటర్నెట్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇందులో కీలక చర్చలు జరగనున్నాయి. అయితే, సోషల్ మీడియాలో దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు మాత్రం వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందలేదు. 

ఈ సదస్సులో సోషల్ మీడియా సమస్యలపైనా చర్చించనున్నారు. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలుగా ఉన్న ఈ రెండింటికి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమని పలు రంగాల ప్రతినిధులు అంటున్నారు. సోషల్ మీడియా సమస్యలపై చర్చించే సదస్సుకు ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రతినిధులకు చోటు లేకపోవడం ఎవరూ ఊహించలేరు. ఈ విషయంపై స్పందించడానికి వైట్ హౌస్ అంగీకరించలేదు.

ఈ సదస్సుకి ఫేస్‌బుక్‌, ట్విటర్ సంస్థలకు ఆహ్వానం అందకపోవచ్చన్న విషయాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే, తమ రిపబ్లికన్ల భావాలను ఈ రెండు సంస్థలు గౌరవించట్లేవని ట్రంప్‌ పలుసార్లు విమర్శలు గుప్పించారు. ఈ సదస్సుని నిర్వహిస్తామని వైట్ హౌస్ జూన్‌లో ప్రకటించింది. ఇందులో సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కీలక చర్చలు జరపవచ్చని తెలిపింది. 

ఇంటర్నెట్ వేదికలో ఉన్న అవకాశాలు, సవాళ్లపై చర్చించుకోవచ్చని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ సదస్సు గురువారం జరగనుంది. ఈ సదస్సులో ఏయే సంస్థలు పాల్గొంటున్నాయన్న విషయం తెలియరాలేదు. గతంలో ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీతో భేటీ అయిన ట్రంప్‌.. ఆ సామాజిక మాధ్యమంలో తన ఫాలోవర్లు ఉన్నట్టుండి ఎందుకు తగ్గిపోతున్నారన్న విషయాన్ని అడిగారు. 

అనంతరం వైట్ హౌస్ ఓ ప్రకటన చేస్తూ యూజర్లను ఫేస్‌బుక్‌, ట్విటర్‌ అనవసరంగా బ్యాన్‌ చేసినా, సస్పెండ్‌ చేసినా తమకు తెలపాలని సూచించింది. తదనుగుణంగా ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు పొరపాటున డేటా నిషేధించినా, సస్పెండ్ చేసినా తెలుసుకునేందుకు వైట్ హౌస్ ఒక టూల్ ప్రారంభించింది. 

మరోవైపు కొంతకాలంగా రిపబ్లికన్లు ఈ రెండు సంస్థలపై విమర్శలు చేస్తున్నారు. తమ ప్రసంగాలను ట్విట్టర్, ఫేస్ బుక్ సెన్సార్ చేస్తున్నాయంటున్నారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా ఉపయోగించుకోని రీతిలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికలను వాడుకున్నారన్నదని వాస్తవం. 

ట్విట్టర్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ యూజర్లందరికీ తమ నిబంధనలను నిష్పాక్షికంగా వాడుతామన్నారు. వినియోగదారుల రాజకీయ అనుబంధంతో తమకు సంబంధం లేదన్నారు. పారదర్శకంగా సేవలందించేందుకు నిరంతరం చర్యలు చేపట్టామన్నారు. 

రిపబ్లికన్ సెనెటర్ టెడ్ క్రూజ్ సారథ్యంలోని రిపబ్లికన్లు ఫేస్ బుక్, ట్విట్టర్ తమ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నిరంతరం రైట్ వింగ్ వాణిని సెన్సార్ చేస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా పూర్తిగా రిపబ్లికన్లు, కన్జర్వేటివ్‌ల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపించారు.