శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన సిలికాన్‌ వ్యాలీలోని మూడు కార్యాలయ భవనాలను కంపెనీ వర్గాలు సోమవారం ఖాళీ చేయించాయి. ఇద్దరు ఉద్యోగులు ‘సారిన్‌’ అనే విషవాయువు బారీన పడినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. కంపెనీకి వచ్చిన ఓ పార్శిల్‌లో ఆ విషయవాయువు ఆనవాళ్లను గుర్తించారు. ఈ అనుమానిత పార్శిల్‌ను తాకిన ఇద్దరు ఉద్యోగుల్లో దాని దుష్పరిణామాలు గమనించినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వాటిని తాకిన వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కంపెనీ వర్గాలు నిబంధనల ప్రకారం ప్రమాద నివారణ చర్యలకు ఉపక్రమించాయి. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకొని కంపెనీకి చెందిన పార్శిళ్ల విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు సైతం ఈ ఘటనపై దృష్టి సారించారు. ‘సారిన్‌’ అనే విషవాయువు అత్యంత ప్రమాదకరమైనది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే 1995లో జపాన్‌లో ఆరు రైళ్లలో సారిన్‌ వదలడంతో 13 మంది చనిపోయారు.

సదరు పార్శిళ్లపై పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని ఫలితాలొచ్చాయి. దీంతో ఫేస్ బుక్ యాజమాన్యం.. అమలులో ఉన్న ప్రొటోకాల్ నిబంధనలను అమలుకు పూనుకున్నది. సదరు పార్శిళ్లలో ఏమున్నదన్న విషయమై ఇంకా దర్యాప్తు అధికారులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మూడు భవనాల్లో సిబ్బందిని ఇతర ప్రాంతాలకు తరలించామని, అందుకోసం ఆయా భవనాల్లో నివాసం ఉంటున్న వారిని అధికారులు వేరే ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించామని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి ఆంటోనీ హర్రీసన్ తెలిపారు. నాలుగు భవనాల్లో పార్శిళ్లపై పరీక్షల్లో అనుకూలం అని తేలిందన్నారు. దీనిపై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారాన్ని అందచేస్తూ సహకరిస్తన్నామని ఫేస్ బుక్ వివరించింది.