అనుకోకుండా మొబైల్ ఎక్కడైనా మరిచిపోయినా, ఎవరైనా ఎత్తుకెళ్లినా, దొంగతనం చేసినా ఆందోళన చెందనక్కరలేదు. దాని జాడ కనిపెట్టేందుకు టెలికం శాఖ (డాట్) టెక్నాలజీని కనిపెట్టింది. వచ్చే నెలలో అది అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ: ఇక నుంచి మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, ఎవరైనా చోరీ చేసినా అంతగా ఆందోళన పడనవసరం ఉండదు. మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ జాడను కనిపెట్టే టెక్నాలజీ వచ్చేనెల నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశారు.
మొబైల్ ట్రాకింగ్ టెక్నాలజీ వ్యవస్థను ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. మీ మొబైల్ ఫోన్ చోరీ చేసిన వారు అందులోంచి సిమ్ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబర్ మార్చేసినా అది ఎక్కడుందో కనిపెట్టేయొచ్చని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.
‘సెంట్రల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమేటిక్స్ (సీ-డాట్) వద్ద ఈ టెక్నాలజీ సిద్ధంగా ఉంది. పార్లమెంటు సమావేశాల అనంతరం టెలికాం శాఖ త్వరలోనే సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి, దీన్ని ప్రారంభించాలని కోరనుంది. ఇది ఆగస్టులో ప్రారంభం కానుంది’ అని ఓ అధికారి తెలిపారు. దీన్ని మహారాష్ట్రల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి చూశామని ఆ అధికారి చెప్పారు.
కాగా, పార్లమెంటు సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. కేంద్ర టెలికాం శాఖ జులై 2017న మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రాజెక్టు ‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)’ను సీ-డాట్‌కు అప్పచెప్పింది. నకిలీ సెల్‌ఫోన్లు, మొబైల్ ఫోన్ల చోరీలను అరికట్టడానికి దీన్ని అభివృద్ధి చేశారు.
సెల్‌ఫోన్ చోరీ అయినట్లు ఫిర్యాదు చేస్తే దానికి ఏ సర్వీసూ అందకుండా సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా బ్లాక్ కూడా చేయొచ్చు. సీఈఐఆర్ సిస్టమ్‌ను అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్‌కు అనుసంధానం చేస్తారు. చోరీకి గురైన 15 నంబర్ల ఐఎంఈఐ నంబర్‌ను మనం ఫిర్యాదులో పేర్కొనాల్సి ఉంటుంది.
