న్యూఢిల్లీ: చిప్ తయారీ మేజర్ ‘ఇంటెల్’ భారత మార్కెట్‌లో తనకు గల ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన వేలాంకని ఎలక్ట్రానిక్స్‌ ఫిర్యాదుతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల డిజైనింగ్, తయారీ కార్యకలాపాలను వేలాంకని ఎలక్ట్రానిక్స్ సాగిస్తోంది. 

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కీలకమైన ప్రాసెసర్స్, చిప్‌సెట్స్, మదర్‌బోర్డు/సర్వర్‌ బోర్డులు తదితరాలను ఇంటెల్‌ తయారు చేస్తోంది. ప్రధానమైన రిఫరెన్స్‌ డిజైన్‌ ఫైల్స్‌ను ఇవ్వడానికి ఇంటెల్‌ మేనేజ్మెంట్ నిరాకరించిందని, తద్వారా తాము స్వంతంగా సర్వర్‌ బోర్డులను రూపొందించకుండా తమను నిరోధించినట్లయిందని వేలాంకని ఆరోపించింది. ఫలితంగా మార్కెట్లో తమ అవకాశాలను దెబ్బ తీసినట్లయిందని వేలాంకని ఎలక్ట్రానిక్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నది.

వేలాంకని ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదు మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఈ నెల తొమ్మిదో తేదీన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాంపిటీషన్ యాక్ట్- 2002లోని నాలుగో సెక్షన్ ప్రకారం ఇంటెల్ ఇతర సంస్థలను ఉత్పత్తి చేయకుండా నిరోధించినట్లేనని, ఇది తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడమేనని సీసీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. 

ఇతర సంస్థలు సర్వర్ల ఉత్పత్తితోపాటు వాటికి సంబంధించి టెక్నికల్, శాస్త్రీయ అంశాల అభివ్రుద్ధిపై పరిమితులు విధించడమేనని సీసీఐ స్పష్టం చేసింది. ఎటువంటి ఆమోదయోగ్యమైన అంశం లేకుండా సాంకేతిక సమాచారం కోరిన సంస్థకు ఇవ్వ నిరాకరించడం ఒర్జినల్ డిజైన్ మాన్యుఫాక్చరర్స్, ఒర్జినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ వివక్షాపూరిత చర్యేనని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్పష్టం చేసింది.