బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ‘కాగ్నిజెంట్‌' దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నదని తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థలో ప్రాజెక్టులు ఇవ్వకుండా సుమారు 18 వేల మంది ఉద్యోగులను ‘బెంచ్‌' పరిమితం చేసిందని, వారిని ఇంటికి సాగనంపేందుకు యాజమాన్యం సిద్ధమైందని సమాచారం. అయితే, ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ చిక్కుల్లో పడనుంది. 

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, కొచ్చి, కోల్‌కతా యూనిట్లలో పని చేస్తున్న వారిపై వేటు పడనున్నది. దీనిపై కాగ్నిజెంట్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ తమ సంస్థ కొందరు ఉద్యోగులను తొలగించ నున్నదని థర్డ్‌ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఖచ్చితత్వం లేదని, కాగ్నిజెంట్‌ ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. కాగ్నిజెంట్‌తో సహా ఐటీ పరిశ్రమల్లో  పనితీరు నిర్వహణ  ఆధారంగా తొలగింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు..

ఉద్యోగుల పనితీరుపై సంస్థ ఇచ్చిన రేటింగ్‌ ప్రకారం 45 రోజుల్లో పనితీరు మెరుగుపర్చుకోవడంలో విఫలమైన వారికి సంస్థ ఈ-మెయిల్స్‌లో తెలియజేస్తున్నదని, ఇటువంటి వారిని రాజీనామా చేయాలని కోరుతున్నదని పలువురు బాధితులు వాపోయారు. 

ఉద్వాసనకు గురైన ఉద్యోగుల అనుభవాన్ని బట్టి 12-21 వారాల ప్యాకేజీతోపాటు ఏడాదికి వారం వేతనం చొప్పున ప్యాకేజీనిచ్చి సాగనంపుతున్నదని తెలిపారు. గతేడాది 35-60 రోజులపాటు బెంచ్‌కు పరిమితమైన ఉద్యోగులను వైదొలగాలని కాగ్నిజెంట్‌ కోరింది.

ఇదిలా ఉంటే, అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఉద్యోగులను తొలగించిందన్న ఆరోపణలతో కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) కాగ్నిజెంట్‌పై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా  వేలాది ఉద్యోగుల తొలగింపులను ఖండించిన కేఐటీయూ తొలగించిన కొంతమంది ఉద్యోగుల ద్వారా కాగ్నిజెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది.

14 రోజులు  కాగ్నిజెంట్ నుండి ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన రాకపోతే, కార్మిక శాఖను ఆశ్రయిస్తామని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి ఉల్లాస్ చమలరంబిల్ చెప్పారు. కార్మిక చట్టాల ప్రకారం, 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు తొలగింపుల అమలుకు మొదట కార్మిక శాఖ నుండి అనుమతి పొందాలని కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియంగా చెప్పారు.

also read:లాక్‌డౌన్ తర్వాత కార్ల జోరు.. ఈ నెలలో విపణిలోకి వచ్చే కార్లివే

పైగా ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామా చేశారని కంపెనీ వాదిస్తోందనీ, వాస్తవానికి, రాజీనామా చేయవలసి రావడంచట్ట విరుద్ధమేనని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.  అలాగే బాధిత ఉద్యోగులు రాజీనామా చేయకుండా తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు.  ఇందుకోసం ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు ఉల్లాస్ తెలిపారు.

బెంగళూరుతోపాటు చెన్నై, పుణెలోని ఉద్యోగులు యూనియన్లను సంప్రదించాయనీ, ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులు కూడా రాజీనామా చేయమని కంపెనీ ఒత్తిడి తెస్తోందని ఉల్లాస్ ఆరోపించారు. ఈ విషయమై తక్షణమే జోక్యం చేసుకొని కార్మిక చట్టాల ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నాటక ప్రభుత్వాన్ని కేఐటీయూ డిమాండ్‌ చేసింది.