గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలపై ఓ కన్నేసి ఉంచాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. భారతీయ వినియోగదారులకు సంబంధించిన ప్రకటనకర్తల నుంచి పొందుతున్న ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నాయని ఈ సంస్థలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అనుమానిస్తోంది. ఇతర విదేశీ సంస్థలు చెల్లిస్తున్న 40% కార్పొరేషన్‌ పన్ను గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు లేదు. అమెరికాలో ప్రధాన కార్యాలయాలు ఉండి, భారతదేశంలో రీసెల్లర్స్‌లా మాత్రమే పనిచేయడంతో వాటికి ఈ సౌలభ్యం కలుగుతోంది. భారతదేశంలో ప్రకటనల ద్వారా పొందే ఆదాయంపై ఈ సంస్థలు 6% ఈక్విలైజేషన్‌ లెవీ చెల్లించాలి. ఈ పన్నును మోదీ ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ పన్ను నిబంధనల ప్రకారం గూగుల్‌, ఫేస్‌బుక్‌ల భారతీయ కార్యాలయాలు సీబీడీటీకి ఫారం1లో ఆ వివరాలు సమర్పించాలి. కానీ, వాటి వాస్తవ ఆదాయం ఎంతన్నది అమెరికాలోని ప్రధాన కార్యాలయాలకు ఆయా సంస్థల భారతీయ కార్యాలయాలు పంపే సమాచారాన్ని పరిశీలిస్తేనే తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం అంతర్జాతీయ పన్ను విభాగాన్ని అనుమతి కోరామని, ఆ సమాచారం అందిన తర్వాత సీబీడీటీకి చేస్తున్న చెల్లింపులతో పోలుస్తామని  చెప్పారు.

భారీ జరిమానా చెల్లిస్తాం: ఫేస్‌బుక్‌ 
వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లినందుకు, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ విధించిన 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.35,000 కోట్ల) జరిమానా చెల్లించేందుకు ఫేస్‌బుక్‌ అంగీకరించింది. పర్యవేక్షణా విధానాలను గణనీయంగా మెరుగు పరుస్తామనీ తెలిపింది. సంస్థ నిర్ణయాల వల్ల వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లితే, బాధ్యత వహించేలా సరికొత్త కార్పొరేట్‌ వ్యవస్థను, నూతన నిబంధనావళిని రూపొందిస్తామనీ తెలిపింది. 2012 నాటి ఆదేశాలను ఉల్లంఘించినందుకు, ఎఫ్‌టీసీ విధించిన జరిమానాకు తోడు, ఇతర ఆదేశాలనూ పాటిస్తామని ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యత నిబంధనలు ఉల్లంఘించినందుకు, మరే సంస్థకు విధించిన జరిమానా కంటే 20 రెట్లు అధికంగా ఫేస్‌బుక్‌కు ఎఫ్‌టీసీ జరిమానా మొత్తాన్ని విధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, ఇంత భారీమొత్తం జరిమానాను అమెరికా ప్రభుత్వం విధించడం ఇదే.