న్యూఢిల్లీ: ఇటీవల నష్టాల్లో కూరుకున్న టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ కనీవినీ ఎరుగని ప్లాన్లతో ముందుకు వచ్చింది. భారీ పోటీని తట్టుకుంటూ కస్టమర్లు చేజారి పోకుండా చూసుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. 

ప్రీపెయిడ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఊహించని రీతిలో ప్లాన్లను ప్రకటించింది. రెగ్యులర్ రీచార్జ్ బెనిఫిట్లతో పాటు లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తోంది. గతంలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఇచ్చినట్లు ఇప్పుడు ప్రీపెయిడ్ వినియోగదారులకు కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రీప్షన్ అఫర్ చేస్తోంది. ఆ ఆఫర్లేమిటో పరిశీలిద్దాం..

కేవలం రూ.179 రీచార్జ్‌తో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు ఇస్తోంది ఎయిర్‌టెల్. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇవే బెనిఫిట్స్ రూ.149 ప్లాన్‌తో కూడా ఇస్తున్నా, మరో రూ.30 ఎక్కువ పెడితే ఏకంగా రూ. 2 లక్షలకు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌ కల్పిస్తోంది. 18-54 ఏళ్ల మధ్య వయస్కులకే ఈ బీమా వర్తిస్తుంది.

28 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.249 రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.4 లక్షల బీమా కూడా అందిస్తోంది ఎయిర్‌టెల్.

28 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.349 ప్రీపెయిడ్ రీచార్జ్‌తో రోజుకు 2జీబీ, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఇస్తోంది ఎయిర్‌టెల్. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయమై భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ మరో అడగు ముందుకేసింది. మరో రూ. 8,004 కోట్లను శనివారం కట్టేసింది. దీంతో ప్రభుత్వానికి కట్టాల్సిన ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలను క్లియర్‌‌‌‌‌‌‌‌ చేశామని పేర్కొంది. 

‘మేం  వేసుకున్న లెక్కల ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు రూ. 13,004 కోట్లే’ అని ఎయిర్ టెల్ తెలిపింది. కంపెనీ ఫిబ్రవరి 17 న డీఓటీకి రూ. 10వేల కోట్లను చెల్లించింది. మిగిలిన రూ. 3,004 కోట్లను శనివారం చెల్లించామని, అంతేకాకుండా అదనంగా మరో రూ. 5,000 కోట్లను కట్టామని పేర్కొంది. 
డీఓటీ వేసే లెక్కలకు తగ్గట్టుగా రీఫండ్‌‌‌‌ లేదా ఎడ్జెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కోసం ఈ మొత్తాన్ని చెల్లించామని తెలిపింది.  దీంతో సుప్రీం కోర్టిచ్చిన తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నామని పేర్కొంది.  భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ రూ. 35వేల కోట్లు కట్టాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ బకాయిలను చెల్లిస్తుండడంతో వొడాఫోన్‌‌‌‌ ఐడియాపై తీవ్రంగా ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ప్యాకేజీ లేకపోతే కంపెనీ మూసేయాల్సి వస్తుందని మొరపెట్టుకుంది.

డిజిటల్‌‌‌‌ కమ్యునికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌(డీసీసీ) శుక్రవారం సమావేశమైనా టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించలేదు.  ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలకు సంబంధించి మరికొంత డేటా అవసరమని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు  ఇంటర్నల్‌‌‌‌గా వేసుకున్న లెక్కలను సమర్పించాలని గతంలో డీఓటీ అడిగింది. 

ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలను  థర్డ్‌‌‌‌ పార్టీ ద్వారా లెక్కించేందుకు కూడా డీఓటీ సిద్ధమయ్యిందని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు కోర్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్ల‌‌‌ ద్వారా వచ్చే రెవెన్యూపై మాత్రమే టెలికాం కంపెనీలు ట్యాక్స్‌ కట్టేవి. సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ నిర్వచనాన్ని మార్చడంతో , గత 14 ఏళ్లకు నాన్‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌ వ్యాపార రెవెన్యూలపై ట్యాక్స్‌‌‌‌ను, వీటిపై వడ్డీని, ఫైన్లు కట్టాల్సి వచ్చింది. ఈ తీర్పు ప్రభావం వొడాఫోన్‌‌‌‌ ఐడియాపై ఎక్కువగా పడింది. కంపెనీ రూ. 50వేల కోట్ల బకాయిలను కట్టాల్సి ఉంది.