ఒసాకా‌: చైనా టెలికం దిగ్గజం హువావేకు పూర్వ వైభవం వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమవుతుండటం హువావేకి కలిసొస్తున్నది. ఇప్పటికే హువావేపై మెత్తబడ్డట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. హువావేపై ఎట్టకేలకు ట్రంప్‌ కరుణ చూపారు. 

 

జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో జరిగిన ఈ మేరకు అంగీకారం కుదిరిందని ట్రంప్ సలహాదారు  వైట్ హౌజ్ ఎకనామిక్ అడ్వైజర్ లర్రీ కుడ్లో ఆదివారం చెప్పారు. దీని ప్రకారం కంపెనీలు హువావేకు పరికరాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం అమెరికా-చైనా చర్చల్లో హువావే కూడా ఒక భాగమని వెల్లడించారు.

 

అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లనంతకాలం హువావే ఫోన్ల విక్రయాలను కొనసాగిస్తారు. చైనా అధినేత జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. వీరిద్దరూ వాణిజయుద్ధంలోని విభేదాలపై చర్చించుకొన్నారు.  ఫలితంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరిందనుకుంటున్న సమయంలో జీ20 వేదికగా ఈ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.

 

దీనిపై హువావే ట్విటర్‌లో స్పందించింది.‘తాను హువావే అనుమతిస్తున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. మరోసారి హువావే అమెరికా టెక్నాలజీని కొనుగోలు చేయవచ్చు!’అని పేర్కొన్నది. ఇటీవల మే నెలలో అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ హువావేకు పరికరాల విక్రయంపై నిషేధం విధించింది. అమెరికా జాతీయభద్రతకు  హువావే ముప్పుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. 

 

మరిన్ని అమెరికా సంస్థలు హువావేతో వ్యాపార సంబంధాలు పెట్టుకునే అవకాశాలున్నాయని వైట్ హౌజ్ ఎకనామిక్ అడ్వైజర్ లర్రీ కుడ్లోచెప్పారు. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా హువావే తీరు ఉందంటూ దానిపై ట్రంప్ సర్కారు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ మొబైల్ ఫోన్లకు అందుతున్న అమెరికా టెక్నాలజీ ఒక్కసారిగా ప్రశ్నార్థకమైంది. 

 

గూగుల్ కూడా హువావేతో సంబంధాలను తెంచుకోనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, వాట్సాప్ అప్ డేట్స్ ఇండబోవని ప్రకటించింది. ఇక హువావేలో వాడే విడి భాగాలను తయారు చేసే అమెరికా టెక్ దిగ్గజాలన్నీ పక్కకు తప్పుకున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, కెనడా 5జీ ట్రయల్స్ లో హువావేను పక్కన బెట్టాలని నిర్ణయించాయి. ఫలితంగా గత నెల హువావే సేల్స్ పడిపోయాయి కూడా. 

 

ట్రంప్ కరుణ చూపడంతో హువావే విక్రయాలకు తాజాగా కొత్త లైసెన్సులు మంజూరు చేస్తామని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్ బర్ రోజ్ తెలిపారు. హువావే ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని అమెరికా పదేపదే ఆరోపిస్తూ వచ్చింది. కానీ తాము ఆ పని చేయబోమని వివరణ ఇస్తూ వచ్చింది. కానీ రిపబ్లికన్ సెనెటర్లు టెడ్ క్రూజ్, మార్కో రూబియో వంటి వారు ట్రంప్ విధించిన నిషేధం ఎత్తివేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ట్రంపి కాటాస్ట్రోపిక్ మిస్టేక్ అని అభివర్ణించారు.