సోషల్ మీడియా వేదికలన్నింటికీ జన్మస్థలం అగ్రరాజ్యం అమెరికా. సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్ దాని అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లను కోట్ల మంది ఇండియన్లు వాడుతున్నారు. కానీ మనకు ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికలు రూపొందించుకోవాలని భారతీయులు ఏనాడూ భావించలేదు.

కానీ మన పొరుగు దేశం చైనా ఎప్పుడో ఆ పని చేసేసింది. సెర్చింజన్ గూగుల్‌కు ‘ఖైదూ’, వాట్సాప్‌కు వీచాట్, ఫేస్‌బుక్‌కు బదులు రెన్ రెన్ వాడుకలోకి తెచ్చింది. తాజాగా భారత్ కూడా ఈ దిశగా సొంత సోషల్ మీడియా రూపకల్పనకు శ్రీకారం చుట్టనున్నది. 

also read వాట్సాప్‌ కొత్త ఫీచర్...చాట్‌ బ్యాక్ అప్‌ ఇక సేఫ్‌..

ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలకు ధీటుగా సొంత సోషల్ మీడియా వేదికలను త్వరలో సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సలహాదారు అమిత్ దూబె తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఇండియా సాఫ్ట్ 2020 సదస్సులో ఆయన మాట్లాడుతూ కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ద్వారా దేశం వెలుపలికి వెళ్లిపోతుందని, దానిపై మనకు ఎటువంటి నియంత్రణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మనకంటూ సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని తెలిపారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి సూచనలు వచ్చాయని అమిత్ దూబె చెప్పారు. అందుకే మనకే ప్రత్యేకించిన ఫేస్ బుక్, క్రిప్టో కరెన్సీ వంటివి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

చైనాలో వీచాట్ కు 100 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని అమిత్ దూబె వివరించారు. ఆ దేశ టెక్నాలజీ దిగ్గజం టెన్సెంట్ కు చెందిన ఈ యాప్ ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ తర్వాతీ స్థానంలో ఉందని తెలిపారు.

వాట్సాప్ చైనాలో సరిగ్గా పని చేయదని, దీనికి దానిపై చైనా విధించిన ఆంక్షలే కారణమని అమిత్ దూబె వెల్లడించారు. డెన్మార్క్‌తో సహా పలు ఐరోపా దేశాలు సొంత సామాజిక మాధ్యమాలను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు.

also read ఒప్పో నుంచి కొత్త యాప్...10 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు...

సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీలో మార్పులు శరవేగంగా వస్తున్నాయని, దీనివల్ల ఎస్ అండ్ పీ 500 కంపెనీల సగటు జీవిత కాలం కూడా మారిపోతుందన్నారు. 1935 ప్రాంతంలో ఇటువంటి కంపెనీలు సగటున 90 ఏళ్లు మనుగడ సాగించగా, 1975 నాటికి 26 ఏళ్లకు పడిపోయిందన్నారు. 2010 నాటికి 14 ఏళ్లకు పడిపోయిందన్నారు. 

టెలిఫోన్ విస్తరణకు 50 ఏళ్లు పడితే, క్రెడిట్ కార్డుల విస్తరణకు 28 ఏళ్లు పట్టింది. ట్విట్టర్, ఫేస్ బుక్ సోషల్ మీడియా సంస్థలు రెండు మూడేళ్లలో పికిమాన్ గో సంస్థ 19 రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టేశాయి. వేగవంతమైన టెక్నాలజీ మార్పులను తట్టుకోగలిగే కంపెనీలే దీర్ఘ కాలం మనుగడ సాధిస్తాయి.

ఇటీవల ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా‌గ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినప్పుడే సందేహాలు వ్యక్తం అయ్యాయి. దేశీయంగా సొంత సోషల్ మీడియా ప్రచారానికి తెర తీసేందుకే సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రధాని మోదీ వైదొలిగారన్న కామెంట్లు వినిపించాయి.