ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో సీనియర్ ఆటగాడు ధోని అనుభవం చాలా ఉపయోగపడుతుందని క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం నుండి టీంఇండియా కెప్టెన్‌, వికెట్ కీపర్, బ్యాట్ మెన్ గా జట్టులో కొనసాగుతున్న ఆటగాడు ధోని ఒక్కడేనని గుర్తుచేశారు. కాబట్టి అతడి సేవలను టీంఇండియా ఈ ప్రంపంచకప్ లో పరిపూర్ణంగా వినియోగించుకోవాలని యువరాజ్ సూచించారు. 

క్రికెట్ గురించిన అపారమైన జ్ఞానాన్ని ధోని సంపాదించాడని యువరాజ్ పేర్కొన్నారు. ఇది ప్రపంచకప్ జట్టులో బరిలోకి దిగే యువ ఆటగాళ్ళతొ పాటు జట్టు సారథి విరాట్ కోహ్లీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వికెట్ కీపర్లకు ప్రతి ఆటగాడి ఆటతీరును నిశితంగా పరిశీలించే అవకాశం వుంటుందని...దాన్ని ధోని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. ఇక జట్టు కష్టాల్లో వున్నపుడు ధోని తన కెప్టెన్సీ చాతుర్యాన్ని ప్రదర్శించేవాడని యువరాజ్ గుర్తు చేశారు. 

ఈ ప్రపంచ కప్ లో టీంఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు ఆటగాళ్లందరికి ధోని సలహాలు, సూచనలు ఉపయోగపడతాయని అన్నాడు. ఆసిస్ తో జరిగిన వన్డే సీరిస్ లో రాణించి తన సత్తా ఏంటో ధోని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నీలోనూ అతడు రాణిస్తాడని భావిస్తున్నట్లు యువరాజ్ తెలిపాడు.