పతకాలు గంగలో విసరేస్తాం.. చావుకు సిద్ధమవుతాం.. రెజ్లర్ల పోరాటం మరింత తీవ్రతరం
Wrestlers Protest: సుమారు నెలన్నర రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగిన రెజ్లర్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో సుమారు నెలన్నర రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము దేశం కోసం సాధించిన పతకాలను గంగ, హరిద్వార్ లో పడేస్తామని.. చావుకు సిద్ధమై ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగబోతున్నామని ప్రకటించారు. ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
రెండ్రోజుల క్రితం పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా.. పార్లమెంట్ వైపు మార్చ్ తీసే క్రమంలో పోలీసులు.. రెజ్లర్లపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి రెజ్లర్లను పోలీసులు.. ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనాల్లో ఎక్కించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
దీనిపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాస్వామ్యవాదుల నుంచి కూడా వారికి మద్దతు లభిస్తోంది. కాగా ఇన్నాళ్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లకు ఇకనుంచి అక్కడ అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. జంతర్ మంతర్ తప్ప మరెక్కడైనా చేసుకోవాలని వెల్లడించారు. ఇది రెజ్లర్లలో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో రెజ్లర్లు.. నేడు (మే30న) సాయంత్రం ఆరు గంటలకు తమకు వచ్చిన ఒలింపిక్, ప్రపంచస్థాయి టోర్నమెంట్, ఇతర టోర్నీలలో వచ్చిన పతకాలను గంగా, హరిధ్వార్ లలో పడేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరేసిన తర్వాత ఇక తాము బతకడంలో ఎలాంటి అర్థమూ లేదని.. అందుకే తాము ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని ట్వీట్ చేసింది. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి.. రాజీపడి జీవించలేమని ట్వీట్ లో పేర్కొంది.
కాగా ఐపీఎల్-16 ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ ను ఓడించిన తర్వాత స్టార్ క్రికెటర్లకు లభిస్తున్న మద్దతు, ప్రశంసల సాక్షి మాలిక్ కూడా స్పందించింది. టైటిల్ గెలచుకున్నందుకు ధోనీ, సీఎస్కేను ఆమె అభినందించారు. అలాగే తమకు ఇంకా న్యాయం జరగలేదని, తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎంఎస్ ధోనీకి, చెన్నై టీమ్ కు అభినందనలు. కనీసం కొంతమంది క్రీడాకారులకైనా తగిన గౌరవం, ప్రేమ లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. న్యాయం కోసం మా పోరాటం ఇంకా కొనసాగుతోంది’’ సాక్షి మాలిక్ మంగళవారం ట్వీట్ చేశారు.