మాస్కో: ఫ్రాన్స్ 2018 ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్స్ లో క్రోయేషియాపై ఫ్రాన్స్ ఫైనల్లో విజయం సాధించింది. ఈ సీజన్ లో అద్భుత విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరుకున్న క్రోయేషియా ఫైనల్లో ఓటమి పాలైంది.

మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 20 ఏళ్ల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే 18 నిమిషం వద్ద ఫ్రాన్స్‌కి వచ్చిన ఫ్రీకిక్‌లో క్రొయేషియా స్ట్రైకర్ మారియో సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. 

ఆ తర్వాత 28వ నిమిషం వద్ద ఇవాన్ పెరిసిక్ అద్భుత గోల్ సాధించి క్రొయేషియా ఖాతా తెరిచాడు. అనంతరం 36వ నిమిషం వద్ద పెనాల్టీ కిక్‌ ద్వారా ఫ్రాన్స్ మరోగోల్ సాధించింది. దీంతో తొలి అర్థ భాగం ముగిసేసమయానికి ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.
 
రెండో అర్థ బాగంలో ఫ్రాన్స్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. 59వ నిమిషం వద్ద పాల్ పోగ్బా, 65వ నిమిషం వద్ద ఎంబాప్పే గోల్స్ సాధించి జట్టుకు అద్భుతమైన ఆధిక్యాన్ని అందించారు. దీంతో క్రొయేషియా పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. ఈ దశలో మారియో అద్భుతమైన గోల్ సాధించి క్రొయేషియాకి కాస్తా ఊరటనిచ్చాడు.

అయితే, చివరకు ఫ్రాన్స్‌ ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.