Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: స్పాన్సర్లు లేక సొంత ఆస్తిని అమ్ముకుంది.. గాయంతో ఆటకు దూరమైనా పోరాడింది.. ఎవరీ సుశీలా దేవి..?

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలలో భారత్ కు పతకాల  పంట పండిస్తున్న ఆటగాళ్లలో ఇప్పటివరకూ మీరాబాయి చాను మినహా అంతా అనామకులే. వీరి గాథలు ఎందరికో స్ఫూర్తినింపుతున్నాయి. ఈ జాబితాలో సుశీలా దేవి కూడా ఒకరు. 

Who is Sushila Devi, Know Interesting Details About Her
Author
India, First Published Aug 2, 2022, 11:01 AM IST

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న  కామన్వెల్త్ క్రీడలలో నిన్నటిదాకా వెయిట్ లిఫ్టర్లే  భారత్‌కు ‘పతక బరువు’లను మోశారు. మీరాబాయి చాను మొదలుకుని సంకేత్ సర్గార్, అచింత షెవులి, గురురాజా పుజారి, హర్జిందర్ కౌర్ లంతా వెయిట్ లిఫ్టర్లే. అయితే సోమవారం మాత్రం వెయిట్ లిఫ్టింగ్ కాకుండా జూడోలో భారత్‌కు పతకం దక్కింది. మహిళల  48 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన సుశీలాదేవి.. తుది పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్ బూ  చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇంతవరకు ఒలింపిక్స్ లో భారత్ ఒక్క పతకం కూడా నెగ్గని ఈ క్రీడలో  సుశీలా దేవి కామన్వెల్త్ గేమ్స్ లో అదరగొడుతున్నది. మరి ఎవరీ సుశీలా దేవి..? ఆమె స్ఫూర్తివంతమైన ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

భారత్‌కు ఈశాన్యాన ఉన్న సెవెన్ సిస్టర్స్ గా పిలిచే మణిఫూర్ మణిపూసే సుశీలా దేవి. మణిపూర్ లోని హీంగాంగ్ మయేయి లేకై ఆమె స్వగ్రామం. జూడో సుశీలా కుటుంబంలోనే ఒక భాగంగా ఉంది. ఆమె మామ దినిక్ సింగ్.. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడు. దినిక్ సింగ్ స్ఫూర్తితో సుశీలా దేవి అన్న శైలాక్షి సింగ్ ఈ ఆటను నేర్చుకున్నాడు. 

అన్నతో వెళ్లి..

సుశీల కూడా అన్న శైలాక్షి ఎక్కడికెళ్తే అక్కడికెళ్లేది. ఎంత దూరమన్నది వాళ్లకు సంబంధం లేని అంశం. ఇంపాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రానికి సుశీల వాళ్ల ఇల్లు సుమారు 10 కిలోమీటర్లు. రోజూ ఉదయమే శైలాక్షి సైకిల్ తీసుకుని కొండలు, గుట్టలు దాటుతూ సాయ్ కేంద్రానికి చేరుకునేవాడు. ఆ సైకిల్ లో వెనకాల కూర్చునేది సుశీల. అన్నతో పాటే సాయ్ కేంద్రంలో శిక్షణ తీసుకుంది. అక్కడే ఆటలో మెలుకువలు నేర్చుకుంది. ఇక జూడోనే తన కెరీర్ అని అనుకుంది.  ఆ దిశగానే ఆమె అడుగులు పడ్డాయి. 

పాటియాలాకు మారి.. 

ఇంపాల్ లో సుశీల ను చూసిన కోచ్ జీవన్ శర్మ ఆమెలోని ప్రతిభ, ఆసక్తిని గమనించాడు. ఆయన సలహాతో ఆమె  పాటియాలాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మారింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మేరీకోమ్ వంటి ఆటగాళ్లను చూశాక ఆమెలో స్ఫూర్తి రగిలింది.  తాను కూడా విశ్వ వేదికపై మెరవాలని కలలు కని.. వాటిని సాకారం చేసుకునేదిశగా కృషి చేసింది. 

2014లో పతకాల వేట ప్రారంభం.. 

48 కిలోల విభాగంలో పోటీ పడ్డ సుశీల.. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజతం సాధించింది. ఇక 2018, 2019  ఆసియన్ ఓపెన్ ఛాంపియన్షిప్స్ లో సిల్వర్ మెడల్, 2019లో కామన్వెల్త్ జూడో ఛాంపియన్షిప్స్ లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018కు ముందు ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న ఆమె ఆశలు ఆవిరవుతున్నట్టు అనిపించింది.  కానీ ఆమె కుంగిపోలేదు. ఇంటికి వెళ్లి  మూడు నెలలు విరామం తీసుకుంది.  తిరిగి 2018లో ఆసియా గేమ్స్ లో పాల్గొనలేకపోయినా 2019లో హాంకాంగ్ వేదికగా జరిగిన హాంకాంగ్ ఓపెన్ లో బరిలోకి దిగింది. 

డబ్బుల్లేక కారు అమ్ముకుని.. 

మామూలుగా భారత్ లో  క్రేజ్ ఉన్న క్రీడలకే ఎక్కువ స్పాన్సర్లు దొరుకుతారు. ఆ జాబితాలో క్రికెట్ ఒక్కటే టాప్. ఇక నీరజ్ చోప్రా, పివి సింధు వంటివాళ్లకు ఎన్నో కష్టాల తర్వాత స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకొచ్చే స్పాన్సర్లు.. భారత్ లో అంతగా  తెలియని జూడోను అసలు పట్టించుకోనేలేదు. ప్రభుత్వం కూడా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కు తప్ప మిగిలిన పోటీల (వరల్డ్ ఛాంపియన్స్) కు పెద్దగా స్పాన్సర్షిప్ చేయదు.  సుశీలాకు కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కుంది.  స్పాన్సర్లు లేకపోవడంతో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న అల్టో కారు, ఇతర వస్తువులను అమ్ముకుని ఆ పోటీలలో పాల్గొన్నది. కొన్నిసార్లు అమ్మడానికి తన దగ్గర స్థిర, చర ఆస్తులు ఏమీ లేకపోవడంతో బ్యాంకులలో లోన్ తీసుకుని మరీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లలో పాల్గొన్నదని సుశీలా దేవి అన్నశైలాక్షి సింగ్ తెలిపాడు. 

కామన్వెల్త్ లో రజతం.. 

స్పాన్సర్లు లేకున్నా ప్రభుత్వ ప్రోత్సాహం అందకున్నా  సుశీలా ఎక్కడా కుంగిపోలేదు. జూడోనే తన ప్రాణం అనుకుంది. ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను సంపాదించిందంతా జూడోలోనే ఖర్చు చేశాను.  ఇంక నా దగ్గర  అమ్ముకోవడానికి ఏమీ మిగలలేదు. కానీ ఈ ఆటను నేను వీడను..’ అని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ లో ఆమె అనుకున్న స్థాయిలో రాణించకున్నా కామన్వెల్త్ క్రీడలలో మాత్రం రజతం నెగ్గి సత్తా చాటింది. 

Follow Us:
Download App:
  • android
  • ios