స్వదేశంలో జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచ కప్ లో వెస్టిండిస్ జట్టు బౌలర్లు చెలరేగుతున్నారు. గయానాలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విండీస్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. బంగ్లా జట్టును కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసి సంచలన విజయం సాధించింది. 

భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106  పరుగులు చేసింది. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన బంగ్లా జట్టును విండీస్ బౌలర్లు దడదడలాడించారు. చురకత్తులాంటి బంతులను ఎదుర్కోలేక బంగ్లా బ్యాట్ ఉమెన్స్ చేతులెత్తేశారు. దీంతో బంగ్లా కేవలం 46 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో విండీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్ లో శుభారంభం చేసింది. 

విండీస్ బౌలర్ డాటిన్ కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. బంగ్లా బ్యాట్ ఉమెన్స్ ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ మార్కును దాటలేందంటేనే విండీస్ బౌలర్లు ఎలా రెచ్చిపోయారో అర్థమవుతుంది. బంగ్లా బ్యాట్స్‌ఉమెన్‌లో ఫర్గానా హక్‌ సాధించిన 8 పరుగులే అత్యధికం కావడం విశేషం. విండీస్ జట్టులో నైట్ 32, టేలర్ 29 చేశారు. బంగ్లా బౌలర్లలో జహనారా 3 వికెట్లు తీశారు.